కోడెల అక్రమాలకు చెక్ పెడదాం : సత్తెనపల్లిలో జగన్

గుంటూరు : ప్రపంచంలో స్పీకర్ పోస్టును భ్రష్టుపట్టించిన ఏకైక నాయకుడు కోడెల శివప్రసాద్ అని వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. కోడెల శివప్రసాద్ కుటుంబం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సేఫ్ ఫార్మా కంపెనీ పేరుతో నాసిరకమైన ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగించారు.
చంద్రబాబు పాలనంతా మోసమేనని విమర్శించారు. చంద్రబాబుకే మళ్లీ అధికారమంటూ తప్పుడు సర్వేలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఐదేళ్ల పాలనలో భయంకరమైన అవినీతి, విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారని విమర్శించారు. స్మశానాలు, మరుగుదొడ్లను కూడా వదలిపెట్టకుండా అవినీతి చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు పాలనలో మోసాలు, అబద్ధాలు, అవినీతి, దౌర్జన్యాలు చూశామన్నారు. సత్తెనపల్లిలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.. ఒక్క జాబు కూడా ఇవ్వలేదన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఎక్కడ భర్తీ చేశారని ప్రశ్నించారు జగన్. ఉద్యోగం రాకుంటే రూ.2 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.. చివరి నాలుగు నెలల్లో ఇస్తారా అని నిలదీశారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి చదువుకున్న విద్యార్థులను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు జగన్. రాజధాని అమరావతి, విశాఖ, దళితుల భూములను వదల్లేదన్నారు. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. వెబ్ సైట్ లో టీడీపీ మ్యానిఫెస్టోను ఎందుకు తీసేశారని ప్రశ్నించారు జగన్.
పొదుపు సంఘాల మహిళలలో చిరునవ్వు కనిపించిందని చంద్రబాబు అంటున్నారు.. నిజమేనని వారంలో దిగిపోతారనే మహిళల ముఖాల్లో ఆనందం కనిపించిందన్నారు. రైతులు, నిరుద్యోగులు, సామాజికవర్గాలు, ఉద్యోగులు, కార్మికుల ముఖాల్లో ఆనందం కన్పిస్తుందన్నారు. కొందరి ముఖాల్లోనే భయం కనిపిస్తుందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలను దోచుకుంటున్న చంద్రబాబు అంటే ఎందుకంత ప్రేమ అని ఎల్లో మీడియాను ప్రశ్నించారు.