జనసేన నేతల్లో టెన్షన్ : పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం పొంచి ఉందా ?

జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన రాయలసీమ జిల్లాల్లో అత్యంత రహస్యంగా సాగుతోంది. అడుగడుగునా సెక్యూరిటీ సమస్యలతో పవన్ సతమతమవుతున్నారు. జనసేన సైనికులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. రాయలసీమ పర్యటనలో ఎప్పుడు, ఎక్కడ, ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ జనసేన వర్గాలను పట్టి పీడిస్తోంది. పవన్ కల్యాణ్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, టిడిపి నేతలపై రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టడంతో.. ఫ్యాక్షన్ నేతల నుండి ముప్పు వాటిల్లుతుందోనని జనసేనికులకు భయం పట్టుకుంది. అంతేకాకుండా పోలీసు సెక్యూరిటీ కూడా అంతంత మాత్రంగా కల్పిస్తూ ఉండడంతో పవన్ కల్యాణ్ పర్యటన, వివరాలను ముందస్తుగా వెల్లడించేందుకు జనసేన నేతలు నీళ్లు నములుతున్నారు. పర్యటనకు కేవలం కొద్ది గంటల ముందు మాత్రమే వివరాలను వెల్లడిస్తున్నారు.
కడపలో పవన్ పర్యటన :
ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో పవన్ కళ్యాణ్ 2 రోజులపాటు పర్యటించనున్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లను, జనసేన సైనికులు సిద్ధం చేశారు. అయితే జగన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అభిమానుల మాటున అల్లరి మూకలు, కొన్ని పార్టీలకు చెందిన వ్యతిరేకవాదుల నుండి పవన్ కల్యాణ్‌కు ప్రమాదం పొంచి ఉందని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా సరైన భద్రతను ఏర్పాటు చేయలేదంటూ, ప్రైవేటు సైక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. మీడియాను సైతం పవన్ దరిదాపుల్లోకి రాకుండా.. ప్రైవేట్ సైన్యం నీడలో పవన్ పర్యటన కొనసాగనుంది.
ప్రైవేటు సైన్యంతో భద్రత :
కర్నూలు జిల్లాలో మూడు రోజులుగా జరిగిన పర్యటనే, ఇందుకు నిదర్శనం. పవన్ కల్యాణ్ సైతం తన భద్రతపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరి భద్రతా అవసరం లేదని, జనసైనికులే తన సైన్యమని అన్నారు. సినీ నాయకుడిగా యువత గుండెల్లో ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్‌ను చూడడానికి వేల సంఖ్యలో యువత తరలి వస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించి దాడులకు దిగే అవకాశం ఉందని, అడుగడుగునా ప్రైవేట్ సైన్యంతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.