బరిలో తండ్రీకూతుళ్లు: అరకులో రసవత్తర పోరు

రాజకీయ రంగస్థలం రసవత్తరంగా ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు ఇలా బంధువులే వేరువేరు పార్టీల నుండి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. అరకు పార్లమెంటు నియోజికవర్గం నుంచి తండ్రీకూతుళ్లు ఎన్నికల రణరంగంలోకి దిగారు.
కురుపాం రాజ వంశానికి చెందిన వైరిచర్ల కుటుంబం నుండి తండ్రీ కూతుళ్లు అరకు పార్లమెంటు నుండి పోటీకి సిద్ధం అయ్యారు. వీరిద్దరూ టీడీపీ, కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్నారు. ఉత్తరాంధ్రాలో సీనియర్ కాంగ్రెస్ నేత వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యునిగా కూడా చేశారు. దాదాపు 30ఏళ్ల పాటు పార్లమెంటులో ఉన్న వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్.. ఇటీవల తెలుగుదేశం గూటికి చేరి ఆ పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, తన తండ్రి టీడీపీలో చేరినా కూతురు శృతీదేవి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయింది. ఆమెకే ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ దక్కింది.
1977లో మొదటిసారి ఎంపీగా ఎన్నికైన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ది కొండ దొర సామాజికవర్గం. ఎస్టీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానం పార్వతీపురం నుంచి ఆయన గతంలో పోటీ చేశారు. ఆ తరువాత అరకులోయ నియోజకవర్గం ఏర్పాటుకాగా 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిపొందారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఆయనకు సహాయ మంత్రి పదవి లభించింది. మైన్స్, స్టీల్, కోల్ మంత్రిగా ఆయన పనిచేశారు.
ఆ తరువాత 2011-14 మధ్య రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయన అప్పుడు కేంద్ర గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వరించారు. ముక్కుసూటి మనిషిగా పేరున్న కిషోర్ చంద్రదేవ్ సొంత పార్టీ నేతలతో విభేదించిన సంధర్భాలు అనేకం. ఇక ఈ నియోజకవర్గం నుంచి గొడ్డేటి మాధవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించింది.