కిలాడీ లేడీ : గ్రూప్-2 ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం

  • Published By: madhu ,Published On : May 12, 2019 / 08:34 AM IST
కిలాడీ లేడీ : గ్రూప్-2 ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం

Updated On : May 12, 2019 / 8:34 AM IST

నిరుద్యోగులే ఆమె టార్గెట్‌. మాటలతో మాయ చేస్తుంది. ఎంతటి వారినైనా తనబుట్టలో వేసుకుంటుంది. ఎంత డబ్బు చెల్లిస్తే అంత మంచి ఉద్యోగమంటూ నమ్మిస్తుంది. అయితే అవేవో చిన్న చితక ఉద్యోగాలు అనుకుంటే పొరాపాటే….ఏకంగా గ్రూప్‌ 2 ఉద్యోగాలనే ఎంపిక చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన నీలిమ అనే మహిళ…వెలుగు విభాగంలో పని చేస్తున్నట్లు స్థానిక నిరుద్యోగ యువతను నమ్మించింది. లక్షల్లో డబ్బులు కాజేసి నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టింది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటలాపాలైంది కిలాడీ లేడీ. 

పలాస పట్టణానికి చెందిన గౌరీశ్వరరావు కుటుంబ సభ్యులు…ఉద్యోగం కోసం నిర్మలను ఆశ్రయించారు. మొదట పలాస మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఉద్యోగం కోసం లక్షన్నర ముట్టజెప్పారు. అయితే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కిలాడీ లేడీ…ఏకంగా గ్రూప్ 2 ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. ఆమె మాటలు విన్న వారు…ఏకంగా 5 లక్షల రూపాయలు ఇచ్చేశారు. ఆ తర్వాత గౌరీశ్వరరావును శ్రీకాకుళం కలెక్టరేట్‌కు తీసుకెళ్లి కార్యాలయ ముద్ర వేయించి వారం రోజుల్లో ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందని గుర్తింపు కార్డు అందజేసి నమ్మించింది. పలాస మండల పరిషత్ కార్యాలయంలో పత్రాల పరిశీలనకు హాజరు కావాలని జీతం వివరాలతో లేఖ సైతం అందించింది. 

ఇక తనకు ఉద్యోగం వచ్చేనట్లేనన్న సంతోషంతో ఆ కిలాడీ లేడీ ఇచ్చిన….లెటర్‌ను తీసుకుని గౌరీశ్వరరావు కుటుంబ సభ్యులు సంబంధిత కార్యాలయంకు వెళ్లారు. అంతే అక్కడి వెళ్లాక ఒక్కసారిగా వారి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అవన్నీ ఫేక్ పత్రాలని అక్కడి అధికారులు చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన గౌరీశ్వరరావు తిరిగి ఆమెను సంప్రదించే ప్రయత్నం చేశారు. 

అయితే పలాస నుండి శ్రీకాకుళంకు తన మకాం మార్చడంతో అక్కడి వెళ్లిన బాధితుడు నీలిమను నిలదీయగా డబ్బులు తిరిగి ఇచ్చేందుకు వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన బాధితుడు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

గౌరీశ్వరరావు ఉదంతం వెలుగు చూడటంతో నీలిమ బాధితులు ఒక్కొక్కరిగా బయటకి వస్తున్నారు. మరోవైపు పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. అసలు నీలిమ పేరుతో వెలుగు డిపార్ట్మెంట్‌లో ఎవ్వరూ లేరని అధికారులు చెబుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మొత్తం పదిహేను మంది నుంచి లక్షల్లో డబ్బులు కాజేసినట్లు పోలీసులు చెబుతున్నారు.