విషమే పాయసం : 50 ఏళ్లుగా పాములే అతడి ఆహారం

ఓ వ్యక్తి మాత్రం పాము కనపడితే చాలు లొట్టలేస్తున్నాడు. చికెన్ ముక్క తిన్నంత ఈజీగా పామును కరకరా నమిలేస్తున్నాడు. మ్యాంగో జ్యూస్ తాగినంత సులువుగా పాము విషాన్ని జుర్రేస్తున్నాడు.

  • Published By: veegamteam ,Published On : October 12, 2019 / 02:41 PM IST
విషమే పాయసం : 50 ఏళ్లుగా పాములే అతడి ఆహారం

Updated On : October 12, 2019 / 2:41 PM IST

ఓ వ్యక్తి మాత్రం పాము కనపడితే చాలు లొట్టలేస్తున్నాడు. చికెన్ ముక్క తిన్నంత ఈజీగా పామును కరకరా నమిలేస్తున్నాడు. మ్యాంగో జ్యూస్ తాగినంత సులువుగా పాము విషాన్ని జుర్రేస్తున్నాడు.

పాము పేరెత్తితే చాలు ఎవరికైనా గుండె గుబేల్ మనాల్సిందే. అలాంటిది పామును చూస్తే ఇక పరుగు లంగించుకోవాల్సిందే. కానీ… ఓ వ్యక్తి మాత్రం పాము కనపడితే చాలు లొట్టలేస్తున్నాడు. చికెన్ ముక్క తిన్నంత ఈజీగా పామును కరకరా నమిలేస్తున్నాడు. మ్యాంగో జ్యూస్ తాగినంత సులువుగా పాము విషాన్ని జుర్రేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తిరుమలేశుడి పేరు పెట్టుకున్నా… చేసేచర్యలు మాత్రం శివుడిని తలపించేలా ఉంటాయి. పాములు కనిపిస్తే పండగ చేసుకుంటాడు. చాకచక్యంగా వాటిని బంధించడమే కాదు… ఆ తర్వాత వాటిని పకోడిలా నమిలి మింగేస్తాడు. 

వెంకటేశ్వర్లు వృత్తి పాములు పట్టడం. అందుకే పాము కనిపిస్తే చాలు పండగ చేసుకుంటాడు. ఎంతటి విషసర్పాలతోనైనా ఆడుకుంటాడు. నాగుపాములను సైతం మెడలో వేసుకుని మురిసిపోతాడు. పాములు పడగవిప్పి నాట్యం చేస్తుంటే… ఇలా శేషపాన్పులా పవళించి చిద్విలాసంతో ఎంజాయ్ చేస్తుంటాడు. అందుకే స్థానికంగా అతడిని పున్నమి నాగు అని పిలుస్తారు. ఇతని… వృత్తి పాములు పట్టడమే అయినా… ప్రవృత్తి గురించి తెలుసుకుంటే మాత్రం అందరూ షాకవ్వాల్సిందే. ఒళ్లు గగుర్పొడవాల్సిందే.

చిన్ననాటి నుంచే పాములు పట్టడంలో ఆరితేరిన వెంకటేశ్వర్లు… పాములు పట్టేవరకు అందరిలాగే వ్యవహరిస్తాడు. కానీ ఆ తర్వాతే తన అసలు రూపం చూపిస్తాడు. ఎవరూ ఊహించని రీతిలో వ్యవహరిస్తూ అందరికీ షాకిస్తాడు. అందరిలా పాములు పట్టుకుని అడవుల్లో వదిలేస్తే తనకంటూ ప్రత్యేక ఏముంటుందని అనుకున్నాడో ఏమో….ఆ పాములను టేస్ట్‌ చేయడానికి రుచిమరిగిన ఈ వెంకటేశ్వర్లు… పాములను పట్టుకున్న తర్వాత వాటిని తన నాలుక, చేతులపై కసిగా కాటువేయించుకుటాడు. తద్వారా వచ్చే విషాన్ని ఆనందంగా మింగేసి అసలైన సంతృప్తి పొందుతాడు. అంతేకాదు… పాము తలను తననోటితో కొరికి కరకరా నమిలేస్తాడు. దసరా రోజున పొలాల్లో రెండు పాములను చూసిన వెంకటేశ్వర్లు మనసు నిమిషం కూడా నిలవలేదు. ఆ పాములను పట్టుకుని నాట్యమాడించాడు. ఆ తరువాత వాటి తలను కొరికేసి.. లొట్టలేసుకుంటూ మింగేశాడు.

పాముకి తలలో… తేలుకి తోకలో విషం ఉంటుందని అంటారు. కానీ తనకు మాత్రం ఒళ్లంతా విషమే  అంటున్నారు వెంకటేశ్వర్లు. తనను ఏం కరిచినా అది కాటికి పోవడం ఖాయమంటున్నాడు. తనను కరిచిన కుక్క పదినిమిషాల్లో చనిపోవడమే అందుకు నిదర్శనమంటున్నాడు. పాము కనిపిస్తే చాలు విషం పిండుకోవడం, తాగడం తనకు అలవాటు అంటున్నాడు. వెంకటేశ్వర్లు వాదనను స్నేక్‌ సొసైటీ సభ్యులు తోసిపుచ్చుతున్నారు. పాములా వెంకటేశ్వర్లు కూడా కుబుసం విడువడం అసాధ్యమంటున్నారు. 

కడుపులో ఎటువంటి గాయాలు లేనంత వరకు పాము విషం తాగినా మనిషికి ఏమీ కాదంటున్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. పాము తలను కొరికి తిన్నా అది జీర్ణమై పోతుందని చెబుతున్నారు. అయితే.. కడుపులో ఏవైనా గాయాలు ఉంటే మాత్రం ఉంటే మాత్రం అతని ప్రాణం పోతుందని, వెంకటేశ్వర్లు కడుపులో గాయాలేవీ లేకపోవడం వల్లే అతడికి ఏమీ కావడం లేదని చెప్పారు.