లక్షణాలు లేకపోయినా కోవిడ్ సోకింది !

కరోనా వైరస్ లక్షణాల్లో భాగమైన జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఏవీ కనపడకపోయినా అత్యధిక శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చి భయ బ్రాంతులకు గురవుతున్నారు. అటువంటి వారు ఇంటికే పరిమితమైపోవాలని ఏపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
సీరో సర్వైలెన్స్ సంస్ధ ఇటీవల నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సీరోసర్వైలెన్స్ సర్వేను వైద్యఆరోగ్య శాఖ నిర్వహించింది. ఈ నాలుగు జిల్లాల్లో నమోదైన కేసుల్లో లక్షణాలు కనిపించకుండా అత్యధిక శాతం మందికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చినట్లు గుర్తిచారు.
అనంతపురం జిల్లాలో 99.5 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, నెల్లూరు జిల్లాలో 96.1 శాతం మందికి లక్షణాల్లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే కృష్ణా జిల్లాలో అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 22.3 శాతం మందికి కోవిడ్–19 తెలియకుండానే వచ్చి వెళ్లిపోయింది. అంటే ఆ 22.3 శాతం మందిలో కోవిడ్–19 యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు వెల్లడైంది.
లక్షణాలు లేకున్నా పాజిటివ్ వస్తే హోం క్వారంటైన్ ‘‘ఎటువంటి లక్షణాలు లేకుండా కోవిడ్–19 పాజిటివ్ వచ్చిన వారిని పది రోజుల పాటు హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచుతున్నామని ప్రభాకర రెడ్డి తెలిపారు. పది రోజుల్లో తీవ్రత ఆధారంగా జ్వరంగానీ, దగ్గుగానీ వస్తే వాటికి మందులు వాడతారు. లేదంటే బలవర్థకమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది.
పదకొండవ రోజు నుంచి వారు బయట తిరగవచ్చు. ఇక వారి నుంచి వ్యాధి విస్తృతి ఉండదు. వారికి మళ్లీ కోవిడ్–19 పరీక్ష కూడా అవసరం లేదు. ఇలాంటి వారు ఎక్కువ మంది హోం క్వారంటైన్‌లో ఉంటారు’’ అని డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి చెప్పారు.