సంబురం : మేడారం చిన జాతర ప్రారంభం

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 06:06 AM IST
సంబురం : మేడారం చిన జాతర ప్రారంభం

వరంగల్ :  మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభై నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ జాతర కోసం వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేసింది. జాతరకు మొత్తం 5 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేసిన అధికారులు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా  చర్యలు తీసుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క – సారక్క పూజారులు ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం మండ మెలిగే పండుగను నిర్వహించారు. సమ్మక్క పూజామందిరంల, సారక్కగుడిలో, కాకతీయ వంశీయుల ఆలయాలను, అమ్మవార్ల పూజాసామగ్రిని సిద్దబోయిన వంశస్తులు శుద్ధిచేశారు. మందిరాల్లోని గద్దెలను ఆడపడుచులు పుట్టమట్టితో అలికి.. ముగ్గులు వేశారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి డోలు వాయిద్యాల నడుమ మామిడి తోరణాలు..పసుపు..కుంకుమలు ఊరేగింపుగా తీసుకొని గ్రామదేవత, బొడ్రాయిల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతర నాలుగురోజులు ఆయా గ్రామాల్లోని పూజా మందిరాల్లో జరగనుంది. అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం మినహా మిగతా పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని నిర్వాహకులు ప్రకటించారు.