రాజధాని రగడ : పవన్‌ది యూ టర్న్ – మంత్రి బోత్స

ఏపీ రాజధాని రగడ ఇంకా ఆగడం లేదు. ఏపీ మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి బోత్స కౌంటర్ ఇచ్చారు. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజధాని విషయంలో పవన్ యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అక్రమాలకు పాల్పడిందని..5 వేల ఎకరాల్లో రాజధాని చాలన్న పవన్ ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. అసలు టీడీపీకి..జనసేన ఎందుకు వత్తాసు పలుకుతోందని ప్రశ్నించారు. అవినీతిని ప్రోత్సాహిస్తున్నట్లుగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. బాబు ఆర్థిక లావాదేవీలకు పవన్ వత్తాసు పలుకుతున్నారని, బాబు ఉంటున్న ఇల్లు, పవన్‌కు స్థలం ఇచ్చిన వ్యక్తి ఒకరే అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ, పవన్ ఉన్నంతకాలం జగన్ వచ్చిన ఇబ్బంది లేదన్నారు.
టీడీపీ హాయాంలో ఏపీలో పెద్ద ఎత్తున దోపిడి జరిగిందన్నారు. రాజధాని పేరు చెప్పి టీడీపీ నూజివీడు ప్రజలను మోసం చేసిందన్నారు. అభవవృద్ధి పేరిట ప్రజలును ఇష్టానురీతిగా దోచుకుందని..మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణంలోనూ దోపిడి జరిగిందని ఆరోపించారు. రాజధాని విషయంలో వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.