అప్పటివరకు రాజీనామా చెయ్యం: స్పష్టం చేసిన మంత్రి

శాసనమండలి నుంచి మంత్రులుగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులు.. ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ శాసన మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసిన క్రమంలో ఎమ్మెల్సీలతో పాటు ఇద్దరు మంత్రుల పదవులు పోయే పరిస్థితి రావడంతో.. ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు.
ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ హోదా లేకుండా మంత్రి పదవికి అనర్హులు కాగా.. మండలి రద్దైతే ఇరువురు నేతలు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అయితే మండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం మండలి రద్దు తీర్మానం చేసిన కారణంగా ముందుగానే అందులోని వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తుంది.
ఈ క్రమంలో ఇదే విషయమై మంత్రి మోపీదేవి వెంకటరమణ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు ఖచ్చితంగా రాజీనామా చేస్తామని, అయితే రాజీనామాలకు కొన్ని పద్ధతులు ఉంటాయని, మండలి రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం నుంచి సమాచారం వచ్చిన వెంటనే రాజీనామా చేస్తామని ప్రకటించారు. టీడీపీ నేతలు డిమాండ్ చేసినంత మాత్రాన మంత్రి పదవులకు రాజీనామా చేయలేమని, దానికి నియమ నిబంధనలు ఉంటాయని స్పష్టం చేశారు.