వారణాశిలో తిరుగుతున్న కరోనా బాంబులు : మరో 30మంది కరోనా పేషెంట్లు మాయం

  • Published By: nagamani ,Published On : July 23, 2020 / 10:16 AM IST
వారణాశిలో తిరుగుతున్న కరోనా బాంబులు : మరో 30మంది కరోనా పేషెంట్లు మాయం

ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో 30మంది కరోనా వైర‌స్ పాజిటివ్ వ్యక్తులు మాయం అయిపోయారు. కరోనా అత్యంత వేగంగా వారణాసి నియోజకవర్గంలో వ్యాప్తి చెందుతోంది.గత 48 గంటల్లో 200కి పైగా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. కానీ..దీన్ని మించి పెను ప్రమాదం ఒకటి పరిణమించింది. అదే కాశీలో 30 మందికి పైగా క‌రోనా బాధితులు మాయం అయిపోయారు.

వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. వారు ఆచూకీ లభించటం ఎంత ఆలస్యమైతే అంత ప్రమాదం జరుగుతుంది. అందుకే పోలీసులు ఆఘమేఘాలమీద వారి కోసం జల్లెడపడుతున్నారు. మిస్ అయినవారంతా అధికారులకు రాంగ్ నంబర్లు ఇచ్చారు. అడ్రస్ లు కూడా రాంగ్ గానే ఇచ్చారు.
కరోనా పాజిటివ్ వచ్చిందని గుర్తించిన రోగ్యశాఖ బృందం వీరికి చికిత్స అందించేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు వారంతా గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయినట్లుగా తెలిసింది. దీంతో ఆరోగ్యశాఖ సిబ్బందిలో ఆందోళ‌న మొద‌ల‌య్యింది.

ఆ క‌రోనా బాధితుల ఆచూకీ తెలుసుకునే ప‌నిని ఆరోగ్యశాఖ పోలీసులకు అప్పగించింది. ఆ 30మంది తమకు తప్పుడు అడ్రస్ లు రాంగ్ నంబర్లు ఇచ్చారని వారణాసి సిఎంఓ డాక్టర్ బీబీ సింగ్ తెలిపారు. ఇలా చాలామంది చేస్తున్నారని ఇది కరోనా మరింతగా వ్యాప్తి చెందటానికి కారణమవుతోందని దీనిపై ప్రజలు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేదంటే సమాజానికి పెను ప్రమాదంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలా వారణాసిలో గత కొన్ని రోజులుగా 24మందికి పైగా కరోనా పాజిటివ్ వ్యక్తులు కనిపించకుండా పోయారని తెలిపారు.

కాగా ఈ బాధితులంతా వారణాసిలోని వివిధ పోలీస్‌స్టేషన్ ప‌రిధుల్లోని ప్రాంతాల‌కు చెందిన‌వార‌ని తెలుస్తోంది. వీరు బ‌య‌ట తిరుగుతుండ‌టంతో అధికారులతో పాటు స్థానికుల్లో భయాందోళన నెల‌కొంది.