జాతీయస్థాయికి అమరావతి ఆందోళనలు: నేడు రాష్ట్రానికి మహిళా కమిషన్‌

  • Published By: vamsi ,Published On : January 11, 2020 / 02:13 AM IST
జాతీయస్థాయికి అమరావతి ఆందోళనలు: నేడు రాష్ట్రానికి మహిళా కమిషన్‌

Updated On : January 11, 2020 / 2:13 AM IST

అమరావతి కోసం ఆడవాళ్లు రోడ్లెక్కారు. రాజధాని ప్రాంతంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా కూడా రాజధాని అంశం సెగలు పుట్టిస్తుంది. ఈ క్రమంలోనే విజయవాడలో వందల మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చెయ్యడం.. ‘రక్తాన్నైనా చిందిస్తాం.. అమరావతిని సాధిస్తాం.. వన్‌ స్టేట్‌.. వన్‌ క్యాపిటల్‌’ అంటూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న మహిళలను అడ్డుకున్నారంటూ జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రేఖాశర్మకు మహిళలు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే రేఖాశర్మ నేతృత్వంలోని ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ (నిజ నిర్ధారణ కమిటీ) ఇవాళ(11 జనవరి 2020) అమరావతిలో పర్యటన చెయ్యబోతుంది. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాజధానిని తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడిని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సిడబ్ల్యు) సీరియస్‌గా తీసుకున్నది. మహిళలను టచ్‌ చేసే అధికారం ఎవరిచ్చారని ఆమె ప్రశ్నిస్తున్నారు. 

టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ స్వయంగా లిఖిత పూర్వకంగా ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌కు కంప్లైంట్ చేశారు. అంతేకాక వందలాది కంప్లైంట్లు రావడంతో జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా ఈ కేసును పరిగణనలోకి తీసుకుంది. గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కూడా ఇదే విషయమై కంప్లైంట్ రైజ్ చేశారు. అమరావతి రాజధాని గ్రామాల్లో కమిషన్‌ సభ్యులు తిరగబోతున్నారు. మహిళల సమస్యలు తెలుసుకుని విచారణ చేస్తారు.

ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్‌ను కలిసి మహిళలకు సంబంధించి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వారు తీసుకున్న చర్యలపై రిపోర్ట్ ఇవ్వమని కోరుతారు. మహిళలపై పోలీసులు చేసిన లాఠీఛార్జిపై ఈ కమిటీ విచారణ చేపడుతుంది.