జూన్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం – కేసీఆర్

జూన్ తర్వాత దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళకళలాడుతుంటది..భూములకు సంబంధించిన సకల సమస్యలను పరిష్కరిస్తామని..భూమి అమ్మినా..కొన్నా గంటలో వెబ్ సైట్‌లో అప్‌లోడ్ అయ్యే విధంగా కొత్త టెక్నాలజీని తీసుకొస్తామన్నారు. రైతులు ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని కేసీఆర్ సూచించారు. ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం నిర్మల్ జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాను స్వయంగా ప్రతి జిల్లాల్లో రెండు…మూడు రోజులు ఉండి భూ సమస్య లేకుండా చేస్తానన్నారు. ఎవరి భూమి ఏంటో తెలుసుకుని అధికారికంగా వారికి పాస్ బుక్ ఇవ్వడమే కాకుండా భూ యజమానికి సంపూర్ణ హక్కును ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఆధునాతనంగా..కొత్తగా రెవెన్యూ చట్టం ఉంటుందని కేసీఆర్ వెల్లడించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. రైతు చనిపోతే కుటుంబానికి రూ. 5 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజన చేయాలని కోరారని..తెలంగాణ రాష్ట్రం రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా ? అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల కళ్లెదుటే ఉన్నాయని గమనించాలని కేసీఆర్ సూచించారు.