నిజామాబాద్‌లో హై టెన్షన్ : రైతన్నల అరెస్టు

నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. రైతులు ఆందోళన విరమించేందుకు పోలీసులు జాతీయ రహదారులపై లైట్లు బంద్ చేసినా…. చీకట్లోనే ఆందోళన కొనసాగించారు. అర్ధరాత్రి పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్‌లలో తరలించారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థతులు తలెత్తాయి.
రైతుల ఆందోళనతో నిజామాబాద్ జిల్లా అట్టుడికింది. పలు ప్రాంతాల్లో మహాధర్నాకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగుతామని హెచ్చరించారు. ఫిబ్రవరి 16వ తేదీ శనివారం జక్రాన్‌పల్లి – ఆర్మూర్ దగ్గరి 44వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక్కడే వంటావార్పు చేశారు. అర్ధరాత్రి వరకు రోడ్డుపైనే బైఠాయించారు. పసుపు క్వింటాలుకు 15వేలు, ఎన్నజొన్నకు 3500 రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.