తప్పు చేయకుంటే భయమెందుకు?: తెలంగాణలో విజయారెడ్డి హత్య.. ఆంధ్రలో తహసీల్దార్ ముందు జాగ్రత్త

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని ఓ రైతు పెట్రోలు పోసి సజీవ దహనం చేయగా ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో అనేకమంది ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగులు అయితే హడలిపోతున్నారు. అధికారులకు భయం మొదలై ఇంతకుముందు కంటే ఇప్పుడు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నారు.
లేటెస్ట్‌గా విజయారెడ్డి హత్య తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన చాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించి, అర్జీలు ఇచ్చేవారు ఎవరైనా తాడు బయట నుంచే ఇవ్వాలంటూ ఆదేశించింది. అంతేకాదు లోపలికి వచ్చేప్పుడు కూడా వారి వెంట తెచ్చుకునేవాటిని పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు.
అయితే తప్పు చేయనపుడు అధికారులకు భయం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ప్రభుత్వాలు.. అధికారులు బలహీనుడికి బలంగా ఉపయోగపడాలి కానీ, చట్టాలు, అధికారులు బలవంతుడికి బలహినంగాను.. బలహీనుడిపై మరింత బలంగానూ అమలు అవుతూ ఉన్నాయని అందుకే సామాన్యుడి తిరుగుబాటు గురించి అధికారులకు భయం పట్టుకుంది అంటున్నారు.
పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి హడావుడి గురించి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. విలేకరులు ఇదే విషయమై ఆమెను వివరణ అడిగారు. దానికి సమాధానంగా.. ‘మా జాగ్రత్త మేం తీసుకోవాలి కదా’ అంటూ సమాధానం ఇచ్చారు.