151సీట్లు దేవుడిచ్చిన వరం, సద్వినియోగం చేసుకోండి.. జగన్ యేడాది పాలనపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ రెండోపార్ట్ వైఎస్ జగన్ సరాసరి టార్గెట్ చేసింది. జగన్ యేడాది పాలనపై కొన్ని నిశితమైన విమర్శలు చేశారు పవన్ కళ్యాన్. మూడు రాజధానులను మొదటి పార్ట్ లో టార్గెట్ చేస్తే ఈసారి పాలనను ప్రస్తావించారు. తాజాగా ఇంటర్వూకి కొనసాగింపుగా పార్ట్ 2 వీడియో విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి 151 సీట్లు రావడం వైసీపీకి దేవుడిచ్చిన వరం.. దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదని తన అభిప్రాయాన్ని బైటపెట్టారు పవన్. దాదాపు 60 కేసుల్లో హైకోర్టులో ప్రభుత్వం ఓడిపోవడం పట్ల పరిశీలన చేసుకోవాలి.. తప్పులను సరిదిద్దుకోవాలని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి తప్ప, అప్పులు పెంచే మార్గాలు పెంచుకోవడం సరికాదని విమర్శించారు. అప్పులు తెచ్చి ప్రజలకిచ్చే పరిస్థితిని అభివృద్ధి అనలేం.. ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. జనసేన నేతలకు రాజకీయ దిశానిర్ధేశం చేశారు.
వైసీపీ నాయకులు న్యాయవాదులను దూషించడం సరికాదని, పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తే ప్రజలు తిరగబడతారు. అగ్రరాజ్యం అమెరికాలో చూశాం. పోలీసులు ప్రజలను ఇబ్బందులుపెట్టకూడదని అధికారులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాజమండ్రిలో జరిగిన శిరోమండనం, డాక్టర్ సుధాకర్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యల గురించి స్పందించిన పవన్.. కరోనా పరిస్థితిలో విద్యావ్యవస్థలు అనుసరిస్తున్న ఆన్ లైన్ క్లాసులు అలాగే విద్యార్థులకు ఒక విద్యా సంవత్సరం వృధా అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. ఆన్‌లైన్ క్లాసులంటూ పూర్తి స్థాయిలో ఫీజు వసూలు చేయడం మంచి పద్ధతి కాదు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈవిషయంలో పవన్ స్పష్టమైన వైఖరినే బైటపెట్టారు.
కరోనాను గవర్నమెంట్ ఆసుపత్రుల వరకే పరిమితం చేశారు. దీన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా విస్తరించాలి.. నాకు తెలంగాణ నుండి క్షేత్రస్థాయిలో సమీక్షలు అందాయి. ప్రభుత్వానికి విజ్ఙప్తి చేయాలని నన్ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. అలాగని గట్టి విమర్శలు చేయలేదు.
ఏపీలో కరోనా కారణంగా చాలా మంది చనిపోయారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయంలోనూ ప్రభుత్వం కూడా చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు..
జనసేన అన్ని కులాల రిజర్వేషన్లపై శ్వేతపత్రం ఎందుకు అడిగింది? కారణాలు చెప్పారు. కార్పోరేషన్ కి సంబంధించిన ఫండ్స్ అన్ని నిర్దేశిత గ్రూపులకే ఇవ్వాలని, వాటిని డైవర్ట్ చేయడం జరిగిందని తెలిసే శ్వేతపత్రం అడిగామని వివరించారు పవన్. కాపు రిజర్వేషన్లు ఇవ్వమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇంకోసారి వాళ్లందరినీ కూర్చోబెట్టి రిజర్వేషన్ విషయాన్ని స్పష్టంగా వివరించాలని, అలాగే శ్వేతపత్రం కూడా విడుదల చేస్తే బాగుంటుందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.