ఎన్నికల్లో ప్రలోభాలకు గురై ఓట్లేస్తే ఇదే పరిస్థితి… జగన్ పై పవన్ సెటైర్

  • Published By: vamsi ,Published On : February 13, 2020 / 06:43 AM IST
ఎన్నికల్లో ప్రలోభాలకు గురై ఓట్లేస్తే ఇదే పరిస్థితి… జగన్ పై పవన్ సెటైర్

Updated On : February 13, 2020 / 6:43 AM IST

ఎన్నికల్లో ప్రలోభాలకు గురై ఓట్లు వేస్తే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితే వస్తుందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లాలో రెండో రోజు పర్యటన చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో మాట్లాడారు.

అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రలోభాలకు గురై ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులే వస్తాయని అన్నారు. చిన్న వంతెన కూడా నిర్మించలేకపోతే ఎన్నికల్లో గెలిచి ఏం ప్రయోజనం అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల మధ్య గొడవ కారణంగా వంతెన నిర్మాణం ఆగిపోవడం దారుణమని అన్నారు.

ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు ప్రజలు కూడా బాగా ఆలోచించుకోవాలని, అప్పుడే సుపరిపాలన అందుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల సంగతి తర్వాత.. జోహరాపురం బ్రిడ్జి వంతెన వంటి చిన్న సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించట్లేదని అన్నారు.