ఇసుక కోసం పోరాటం: ఇసుకేస్తే రాలనంత జనం

ఇసుక సమస్యపై పోరుబాట పట్టింది జనసేన పార్టీ. ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు అండగా లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు విశాఖపట్నం చేరారు పవన్ కళ్యాణ్. ఇసుకను అందుబాటులోకి తెచ్చి ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచేందుకు లాంగ్ మార్చ్‌లో పాల్గొనేందుకు విశాఖకు చేరుకున్నారు.
జనసేన కార్యకర్తలు కూడా భారీగా విశాఖకు చేరుకున్నారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి జంక్షన్ నుంచి రామా టాకీస్, ఆశీల్‌మెట్ట మీదుగా జీవీఎంసీ బిల్డింగ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు లాంగ్‌మార్చ్ కొనసాగనుంది. మార్చ్ అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. వాస్తవానికి మూడు గంటలకు లాంగ్ మార్చ్ ప్రారంభం కావలసి ఉండగా కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది.
అన్ని ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులకు ఫోన్లు చేసి పాల్గొనాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయగా.. బీజేపీ, టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ సహకారం తీసుకోవడంతో ఉభయ కమ్యునిస్టు పార్టీలు(సీపీఎం, సీపీఐ) నుండి నాయకులు హాజరు కావట్లేదు. లాంగ్ మార్చ్‌లో టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు కూడా పాల్గొంటున్నారు.
ఇక జనసేన నేతలు నాదెండ్ల మనోహన్, నాగబాబు, తోట చంద్రశేఖర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, కోన తాతారావు తదితరులు లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. ఇక విశాఖలో ఇసుకేస్తే రాలనంత జనం ఇసుక కోసం వచ్చారు.