జగన్ నిర్ణయం…జనం మధ్య చిచ్చుపెట్టడమే: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో జగన్ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో భూ సేకరణ పనులను చేపట్టింది. ఈ క్రమంలో కొన్ని చోట్ల వ్యతిరేకతలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఉగాదికి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైనవారికి పట్టాలు ఇవ్వాలని భావిస్తోండగా.. అవసరమైన చోట్ల ల్యాండ్ పూలింగ్ చేస్తుంది. లేటెస్ట్‌గా అమరావతి ప్రాంతంలో గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలకు చెందినవారికి ఇళ్ల స్థలాలు కేటాయించడంపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇళ్ల పట్టాలకు సంబంధించిన స్థలాల విషయంలో వివాదాలు లేకుండా చూడాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయి అన్నారు ఆయన. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాలకు ఆస్కారం ఇస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇల్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. చిత్తశుద్ది ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే వారికి ఇవ్వాలి అన్నారు జనసేనాని. ఓవైపు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుందని అన్నారు పవన్ కళ్యాణ్. రాజధాని కోసం ఉద్దేశించిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని.. తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో పేదలు ఇబ్బందిపడతారని వ్యాఖ్యానించారు.
రాజధాని గ్రామాలలోనే కాకుండా జిల్లాల్లోనూ స్థలాల కోసం ఇచ్చిన భూములు చుట్టూ వివాదాలు ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్. అసైన్డ్ భూములను, స్మశాన భూములను, పాఠశాల మైదానాలను ఇళ్ల స్థలాలుగా మార్చాలని నిర్ణయించడం ఈ పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని వెల్లడిస్తోంది అన్నారు పవన్ కళ్యాణ్.
వివాదాలకు తావు లేని భూములనే ఇళ్ల స్థలాలకు ఇవ్వాలి- JanaSena Chief @PawanKalyan pic.twitter.com/kftX46gLqz
— JanaSena Party (@JanaSenaParty) February 26, 2020