ఖాళీ చేయిస్తున్న పోలీసులు : టీడీపీ శిబిరం నుంచి బాధితుల తరలింపు

టీడీపీ నిర్వహిస్తున్న బాధితుల శిబిరం వద్దకు పోలీసులు చేరుకున్నారు. అందులో ఉన్న వారిని బయటకు తీసుకొస్తున్నారు. వీరందరినీ వారి వారి స్వగ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా భారీగా పోలీసులు మోహరించారు. శిబిరం వద్దకు పొలిటికల్ లీడర్స్ ని అనుమతించడం లేదు. 9 రోజులుగా టీడీపీ ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది.
సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం టీడీపీ, వైసీపీ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బాధితుల శిబిరంలో ఉన్న వారిని తరలించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అందులో ఉన్న దాదాపు 200 మందిని వారి వారి స్వగ్రామాలకు తరలిస్తున్నారు. ఇందుకు బస్సులను ఏర్పాటు చేశారు. వీరు ఏ గ్రామానికి చెందిన వారు..తదితర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
వైసీపీ నేతల దాడులు పెరిగిపోయాయని టీడీపీ ఆరోపిస్తోంది. కొన్ని రోజులుగా బాధితులతో శిబిరాలను నిర్వహిస్తోంది. చలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడనే టీడీపీ నేతలను అరెస్టు చేశారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొందని, కావాలనే బాబు రెచ్చగొడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.