పోస్టల్ బ్యాలెట్ పరేషాన్ : హైకోర్టులో ఉద్యోగుల సమాఖ్య  పిటిషన్

  • Published By: madhu ,Published On : May 8, 2019 / 03:52 PM IST
పోస్టల్ బ్యాలెట్ పరేషాన్ : హైకోర్టులో ఉద్యోగుల సమాఖ్య  పిటిషన్

Updated On : May 8, 2019 / 3:52 PM IST

ఒక్క ఓటు కూడా జీవితాన్ని మార్చేస్తుంది. గెలుపోటములను తారుమారు చేస్తుంది. 2014 ఎన్నికల్లో మంగళగిరిలో వైసిపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గెలిచింది కేవలం 12 ఓట్ల మెజారిటీతోనే. ఆ మెజారిటీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిందే. ఈ నేపధ్యంలో పోస్టల్ బ్యాలెట్‌లకు డిమాండ్ పెరిగిపోతోంది. అయితే వేలాది మంది ఉద్యోగులకు ఓటు హక్కు లేకుండా జరగటంతో ఇప్పుడు అది ఎవరిపై వ్యతిరేక ప్రభావం చూపుతుందో అని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. గత ఎన్నికల్లో వందల మెజారీటీతో గెలిచిన వారు పదుల సంఖ్యలో ఉండటంతో పోస్టల్ బ్యాలెట్లు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. 

ఏపీలో ఎన్నికల విధుల్లో 4 లక్షల 48వేల 443 మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. లెక్క ప్రకారం వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి. కానీ పోస్టల్ బ్యాలెట్ పొందిన ఉద్యోగులు 3 లక్షల 64వేల  249 మంది మాత్రమే. అంటే 84 వేల 194 మందికి పోస్టల్ బ్యాలెట్ అందలేదు. ఇందులో పోస్టల్ బ్యాలెట్లు అందనివారు కొందరు ఉండగా సకాలంలో పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకోలేకపోయినవారు మరికొందరున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో ఉద్యోగుల కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు కూడా చేశారు. ఆర్మీ ఉద్యోగులకు పోస్టల్ బాలెట్ అందలేదని విశాఖ కలెక్టరేట్ ఎదుట వారి కుటుంబసభ్యులు ధర్నా నిర్వహించారు.  అయితే ఇప్పుడు తాజాగా పోస్టల్ బాలెట్ అందలేదని కొంతమంది ఉద్యోగులు హైకోర్ట్ కెక్కటం చర్చనీయాంశమైంది. 

పోస్టల్ బ్యాలెట్ అవకతవకలపై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య  హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణకు నిరాకరించింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య  సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతోంది. చివరినిమిషంలో పోలింగ్ డ్యూటీ వేసినందువల్ల 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు కోల్పోయారని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆరోపిస్తోంది. 

పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా చిత్తూరులో 17,392 ఉంటే శ్రీకాకుళంలో అతితక్కువగా 576 ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లు అందని ఉద్యోగులు ప్రతీ జిల్లాలోను సగటున ఆరున్నర వేలమంది ఉన్నారు. ప్రతీ ఓటూ చాలా కీలకమైనప్పుడు ఆరున్నర వేల ఓట్లంటే మామూలు విషయం కాదు. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్లు అందని ఓటర్లను 175 నియోజకవర్గాలకు చూస్తే సగటు 481గా ఉంది. వీరందిరికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇస్తే ఎవరికి ఓట్లు పడతాయో తెలీదు. తమకు పడవని టిడిపి అంచనా వేసుకుంది కాబట్టే వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందకుండా చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది.

ఈ సమస్యను పరిష్కరించాలని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీని కలిసి విజ్ఞప్తి చేశారు. మడకశిర నియోజక వర్గంలో 108 మందికి రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారని ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆరోపించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లపై కొన్ని చోట్ల ఫిర్యాదులు అందిన మాట నిజమేనన్నారు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఒక్కో నియోజకవర్గంలో నాలుగైదు వందల పోస్టల్ బ్యాలెట్లు ఉండొచ్చన్నారు. దీనిపై కలెక్టర్ల నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు ద్వివేది.

కొన్నిచోట్ల రెండు, మూడు బ్యాలెట్లు అందినట్లు కూడా తన దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగులు ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ద్వివేది. చాల నియోజకవర్గాల్లో పొస్టల్ బ్యాలెట్లు కూడా కీలకం కానున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ దృష్టి పెట్టింది. ఉద్యోగ సంఘాలు కూడా వీటిపై పోరాటం చేస్తున్నాయి. కౌంటింగ్‌కు గంట ముందు కూడా ఇచ్చే వెలసుబాటు ఉండటంతో చివరి నిమిషం వరకు కూడా పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాయి.