మార్కెట్‌లో కుండల సీజన్ : కుమ్మరుల జీవనం దుర్భరం

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 02:49 PM IST
మార్కెట్‌లో కుండల సీజన్ : కుమ్మరుల జీవనం దుర్భరం

Updated On : April 14, 2019 / 2:49 PM IST

వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే.. చల్లని నీళ్లు తాగాల్సిందే. గుక్కెడు గుక్కెడుగా నీళ్లు గొంతులోకి వెళ్తుంటే… అప్పటి వరకు ఉన్న ఉష్ణ తాపం ఒక్కసారిగా ఎగిరిపోతుంది. ఫ్రిజ్‍‌లో నీళ్లు తాగినా అంతగా ప్రాణం తెప్పరిల్లదు కానీ… అదే కుండలో నీళ్లు తాగితే మాత్రం క్షణాల్లో కుదుటపడుతుంది. సమ్మర్‌ సీజన్ కావడంతో ఎక్కడ చూసినా కుండలు, కూజాలు, రంజన్ల వినియోగం పెరిగింది. కానీ.. అవి తయారు చేసే కుమ్మరుల జీవితాలు మాత్రం ఎండబారిపోతున్నాయి.

బయట ఎండలు మండిపోతుంటే.. జనాల గొంతులు ఎండిపోతున్నాయ్. చల్లని నీళ్లు తాగితే తప్ప.. ప్రాణం కుదుటపడని పరిస్థితి. దీంతో.. కుండలకు గిరాకీ పెరిగిపోయింది. ప్రాంతంతో సంబంధం లేకుండా.. ఎక్కడ చూసినా కుండలు, కూజాలు, రంజన్లే కనిపిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు… చల్లని నీటితో ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఫ్రిజ్ కంటే కూడా కుండలోని నీళ్లు ఆరోగ్యానికి మంచిది కావడంతో.. వీటిని కొనేందుకే జనాలు ఎక్కుగా ఆసక్తి చూపిస్తున్నారు. 

అయితే.. ఇంత చల్లదనం ఇచ్చే కుండల తయారీ వెనక పెద్ద కథే ఉంది. ఎంతో శ్రమ, మరెంతో నైపుణ్యం ఉంటే తప్ప.. గుండ్రని కుండ.. కూజాలు తయారు కావు. వీటి తయారీ కోసం… ముందుగా… కుమ్మరులు చెరువుల దగ్గర నుంచి ఒండ్రు మట్టిని సేకరిస్తారు. రాళ్లను, వేర్లను వేరు చేసి.. ఆ మట్టిపై నీళ్లు చల్లి నాలుగైదు రోజులు నానబెడతారు. ఆ తర్వాత.. దానికి కొన్ని కొన్నిగా నీళ్లు చల్లుతూ.. కాళ్లతో తొక్కుతారు. ఆ మట్టిని తీసుకుని స్థూపాకారంగా చేసి, తిరిగే చక్రం పై ఉంచుతారు. 

చక్రాన్ని తిప్పుతూ… చేతులతో ఒత్తిడి తెస్తూ.. మట్టికి ఓ రూపాన్ని ఇస్తారు కుమ్మరులు. కుండ తయారయ్యాక… అడుగుభాగంలో పుల్లను గుచ్చి మట్టి ముద్దనుంచి కుండను ఒడుపుగా వేరుచేస్తారు. వాటిని రెండు రోజులు నీడలో ఆరబెట్టి… ఆ తర్వాత వామిలో వేసి మంటపెడతారు. ఇలా తయారైన వాటిని మార్కెట్‌కు తరలించి… అమ్మకానికి పెట్టి జీవనం గడుపుతారు కుమ్మరులు. 

నిజామాబాద్ పట్టణంలో సుమారు 150 కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. అయితే… కుటుంబం మొత్తం రోజంతా కష్టపడినా… 20 కుండలకు మించి తయారు కావు. దీనికి తోడు.. మట్టి సేకరించడం చాలా ఇబ్బందిగా మారింది. ఎంతో కష్టపడి తయారు చేసినా.. కాల్చేప్పుడు కొన్ని పగిలిపోతుంటాయి. మార్కెట్‌కు చేర్చేలోపు కొన్ని పగిలిపోవడం.. కనీస ధర రాకపోవడంతో.. వారి జీవనం దుర్భరంగా మారుతోంది. ఇక వేసవిలోనే కాస్త ఆదాయం లభించినా… మూడు నెలల సీజన్ తర్వాత కూలీనాలీ చేసుకోవాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం, బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడంతో… కులవృత్తిని నమ్ముకుని బతకడం కష్టంగా మారిందంటున్నారు.

లోహపు పాత్రలు అందుబాటులోకి వచ్చాక మట్టి కుండల వినియోగం బాగా తగ్గినా ఈ కుండల తయారీ పూర్తిగా అంతరించిపోలేదు. అయితే.. ఇత రాష్ట్రాల నుంచి వస్తున్న రంజన్లు, కుండలు, స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నాయి. పెట్టుబడిదారుల ధాటికి తట్టుకోలేక గ్రామీణ కుండల తయారీదార్లు తమ వృత్తిని వదిలేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా కులవృత్తుల వారిని ఆదుకోవాలని… కుమ్మరివృత్తివాళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.