బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా రాదట..!!

కరోనా రాకుండా ఉండాలంటే బురదలో కూర్చుని శంఖం ఊదితే రాదట. ఈ మాట సాక్షాత్తు రాజస్థాన్ బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనపూరియా చెబుతున్నారు. బురదలో కూర్చొని ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని..శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితే కరోనా రాదనీ.. చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..ఇలా చేస్తే కరోనా రాదని..అది తింటే కరోనా రాదని బీజేపీ నేతలంతా చెబుతున్నారు. గతంలో కూడా కొంతమంది బీజేపీ నేతలు కరోనా గురించి ఎటువంటి సలహాలిచ్చారంటే..
‘భాభీజీ అప్పడాల్లో’ రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు ఉన్నాయని కాబట్టి భాభీజీ అప్పడాలు తినండి..కరోనాను ఎదిరించండి .. ఆ అప్పడాలు తింటే కరోనా రాదని సాక్షాత్తు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్ వాల్ సెలవిచ్చారు. అలా చెప్పిన ఆయన మరి ఆ అప్పడాలు తినలేదో ఏమోగానీ..ఆయనకు కరోనా వచ్చి హాస్పిటల్ లో చేరారు.
అలాగే మరో బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కూడా ప్రతి రోజు ఐదు సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా వైరస్ తగ్గిపోతుందని తెలిపారు. కరోనా నుంచి విముక్తి పొందటానికి అందరం కలిసి ఆధ్యాత్మిక బాటలో పయనిద్దామని ఆమె పిలుపునిచ్చారు. జులై 25 నుంచి ఆగస్టు 5 వరకు ప్రతి ఒక్కరు ఇంట్లో ఐదుసార్లు హనుమాన్ చాలీసా పఠించాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో భూమి పూజ జరిగిన తర్వాత అందరం ఇళ్లలో దీపాలు వెలగించి హనుమాన్ చాలీసాను ముగ్గిద్దామని చెప్పారు. మరొకరు అయోధ్యలో రామమందిర నిర్మాణాణానికి భూమి పూజ అయిన తరువాత కరోనా ఖతం అయిపోతుందని చెప్పారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడటం విమర్శలకు దారి తీస్తోంది.
కరోనాను కట్టడి చేసేందుకు యావత్ ప్రపంచం శ్రమిస్తోంది. వ్యాక్సిన్ కోసం పరిశోధకులు కుస్తీలు పడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఎవరికి నచ్చిన చిట్కాలు వారు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అంటూ పొంతనలేని మాటలు చెబుతున్నారు. తాజాగా రాజస్థాన్ బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనపూరియా బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా రాదని చెప్పిన చిట్కాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.