శ్రీనివాస గోవిందా : తిరుమల కిటకిట..కన్నుల పండుగగా రథోత్సవం

శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో తిరుమాడ వీధుల్లో తిరుగుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షించారు. 2019, అక్టోబర్ 07వ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం జరుగుతోంది. స్వామి వారిని చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. రాత్రి 8 నుంచి 9 గంటలకు అశ్వవాహన సేవ జరుగనుంది.
అక్టోబర్ 08వ తేదీ మంగళవారం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య.. ఉత్సవాల ముగింపు సందర్భంగా చక్రస్నానం జరుగనుంది. ఇందుకోసం పుష్కరిణిని టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల రద్దీతో దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల జారీని మరో వారం రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఏడో రోజు..అక్టోబర్ 06వ తేదీ ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగారు. యోగముద్రలో బద్రీనారాయణుడి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై ధన్వంతరిగా కనువిందు చేశారు శ్రీనివాసుడు. శ్రీ వెంకటేశ్వరుడికి సూర్య చంద్రులు రెండు నేత్రాలు. సూర్యుడు తేజోనిధి, ప్రకృతికి చైతన్య ప్రదాత, సకల రోగాల నివారకుడు. స్వర్ణకాంతులీనే భాస్కరుడిని సప్త అశ్వాల రథసారధిగా చేసుకుని మలయప్ప రాజమన్నారుడి రూపంలో స్వర్ణకాంతులీనుతూ ఉదయం వేళ తిరుమాడ వీధుల్లో వైభవంగా విహరించారు. ఇక భగవంతుడి మారు రూపమే చంద్రుడి వాహనంగా మలుచుకున్న వెంకటాచలపతి రాత్రి వేళలో తిరుమాడ వీధుల్లో తన దివ్యమంగళ రూపాన్ని భక్తులకు దర్శనమిచ్చారు.
మరోవైపు టీటీడీ కిటకిటలాడుతోంది. దసరా సెలవులు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులకు తిరుమలకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. సర్వదర్వనం ద్వారా భక్తులకు 24 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది. భారీగా భక్తులు పోటెత్తడంతో వసతి గృహాలు దొరకడం కష్టతరమౌతోంది. దీంతో రాత్రి వేళల్లో ఉద్యానవనాల్లో, రహదారుల పక్కనే సేద తీరుతున్నారు.
Read More : సద్దుల శోభ : వెళ్లిరా బతుకమ్మ..మళ్లీ రావమ్మా