‘సంక్రాంతి’ ప్రత్యేకతలు తెలుసుకోండి

  • Published By: veegamteam ,Published On : January 9, 2019 / 06:32 AM IST
‘సంక్రాంతి’ ప్రత్యేకతలు తెలుసుకోండి

తెలుగువారు జరుపుకొనే పండుగల్లో పెద్దపండుగ సంక్రాంతి! మిగతా పండుగల్లాగా ఈ పండుగకు తిథులతో, సంబంధం లేదు. సంక్రాతి వచ్చిందే తుమ్మేదా.. సరదాలు తెచ్చిందే తుమ్మేదా.. ఇలా ప్రతి ఏడాది తొలిమాసంలో వచ్చే ఈ పండుగకు ఉన్న ప్రత్యేకతలే వేరు. సంక్రాంతీ అనగానే అందరికీ గుర్తొచేది ఏంటీ… కోడికూతతోనే నిద్రలేచి, వాకిలి చిమ్మి, పేడనీటితో కళ్లాపి చల్లి ముంగిట్లో ముగ్గులు తీర్చిదిద్దడం తెలుగిళ్లలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చక్కగా ఆవుపేడతో అలికిన ఇంటి ముందు ముగ్గులతో ముంగిలి ముచ్చటగా ఉంటుంది. ఇంటి ముంగిట అందంగా ముగ్గులు తీర్చిదిద్ది గొబ్బెమ్మలను పేర్చితే ఆ ఇంట శుభకార్యం ఏదో జరుగుతోందని అప్పట్లో మన పెద్దలు అనేవారు. అందుకే ఆడవాళ్లంతా ముగ్గు వెయ్యడం విధిగా, అదే తమకు నిధిగా భావిస్తుంటారు. పూర్వం ఇల్లు అలికి ముగ్గుపెట్టనిదే వంటే చేసేవారు కాదు. అందరి లోగిళ్లూ ముగ్గు మందారాలయినప్పుడు ఊరంతా సంక్రాంతే మరి.  

అల్లుళ్లకి అసలైన పండుగ..
అంతే కాదండోయ్.. ఇది అల్లుళ్లకి అసలైన పండుగ. అల్లుడిని పిలిచి తగిన మర్యాదలు చేయాలంటే చేతిలో కాస్తో కూస్తో ధనధాన్యాలు ఉండాలి. వ్యవసాయం మీద ఆధారపడి జీవించే మన దేశంలో అల్లుడికి కావల్సిన పంచభక్ష్యాలు అందించేందుకు సంక్రాంతికి మించిన ముహూర్తం మరొకటి ఉండదు కదా. 

పక్షులకూ పండుగే :
కోతలు పూర్తయిన తరువాత రైతులు కొన్ని ధాన్యపు గింజలను తీసి ఉంచుతారు. వీటిని ఇళ్లకి ఉన్న చూర్లకి వేలాడదీస్తారు. అవి ఆ ఇంటిచుట్టుపక్కల తిరిగే పక్షుల కడుపుని నింపుతాయి.

పిండి వంటల పండుగ : 
కొత్తబియ్యంతో అన్నం వండుకుంటే అజీర్ణం చేస్తుంది. కాబట్టి చేతికి వచ్చిన ధాన్యాన్ని పిండివంటలుగా చేసుకుంటారు. ఈ కొత్త బియ్యానికి కొత్త బెల్లాన్ని జోడించి అరిసెలో, పొంగలో వండుకుంటారు. లేదా బియ్యపుపిండితో సకినాలు చేసుకుంటారు. పెద్దగా నూనె లేకుండా బియ్యంతో  అరిసెలు, సకినాలు చేసుకుంటారు. 

ఇంతేనా అనుకుంటూన్నారా… సంక్రాంతి నాడు హరిదాసులు, గంగిరెద్దులు, నదీస్నానాలు, రేగుపండ్లు, బంతిపూలు.. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగ ఒక పండుగతో కాదు వంద పండుగలతో సమానం అనాల్సి వస్తుందేమో…!