రంజుగా నందికొట్కూరు రాజకీయం : ఎస్సీల కోటాలో రెడ్ల హవా

  • Published By: madhu ,Published On : February 7, 2019 / 03:25 PM IST
రంజుగా నందికొట్కూరు రాజకీయం : ఎస్సీల కోటాలో రెడ్ల హవా

Updated On : February 7, 2019 / 3:25 PM IST

రంజుగా మారిన నందికొట్కూరు పాలిటిక్స్‌…
ఎస్సీల కోటలో రెడ్ల రాజకీయం
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పార్టీలు
టీడీపీకి పునర్‌వైభవం దక్కుతుందా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ పాగా వేస్తుందా..?

కర్నూలు : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నందికొట్కూరు పాలిటిక్స్ రంజుగా మారుతున్నాయి. నియోజకవర్గంలో సత్తా చాటుకునేందుకు…అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించి పునర్‌వైభవం చాటుకుంటుందా ? లేదంటే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ విక్టరీ కొడుతుందా ? 

నందికొట్కూరులో 14 సార్లు ఎన్నికలు
కాంగ్రెస్, కాంగ్రెస్‌ (ఐ)లు 8 సార్లు, టీడీపీ మూడు పర్యాయాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఐ ఒక్కోసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు
1952లో గెలుపొందిన చండ్ర పుల్లారెడ్డి
1978లో కాంగ్రెస్‌ (ఐ) అభ్యర్థిగా బైరెడ్డి శేషశయనరెడ్డి గెలుపు
1983లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం 
కొంతకాలం మంత్రిగా పని చేసిన శేషశయనరెడ్డి

కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నవనందులు కొలువై ఉండటంతో…ఈ ప్రాంతం నందికొట్కూరుగా పేరు గాంచింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే….కాంగ్రెస్, కాంగ్రెస్‌ (ఐ)లు 8 సార్లు, టీడీపీ మూడు పర్యాయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఐ ఒక్కోసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు సత్తా చాటారు. ప్రముఖ కమ్యూనిస్టు నేత చండ్ర పుల్లారెడ్డి 1952లో నందికొట్కూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1978లో కాంగ్రెస్‌ (ఐ) అభ్యర్థిగా గెలుపొందిన బైరెడ్డి శేషశయనరెడ్డి, 1983లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలం మంత్రిగా కూడా పని చేశారు. 

బైరెడ్డి శేషశయనరెడ్డి మూడు సార్లు
బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రెండు పర్యాయాలు విజయం 
పునర్విభజనతో ఎస్సీ రిజర్వుడుగా నందికొట్కూరు
బైరెడ్డి, గౌరు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు 
2004 తర్వాత తగ్గుతోన్న బైరెడ్డి కుటుంబం హవా

నందికొట్కూరు నియోజకవర్గం నుంచి బైరెడ్డి శేషశయనరెడ్డి మూడు సార్లు, ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రెండు పర్యాయాలు విజయం సాధించారు. 2009 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న నందికొట్కూరు… నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ రిజర్వుడుగా మారిపోయింది. నందికొట్కూరుతో పాటు పగిడ్యాల, మిడ్తూరు, ఆత్మకూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలం కొత్తగా వచ్చి చేరింది. నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి, గౌరు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 2009 ఎన్నికల్లో గౌరు కుటుంబం లబ్బి వెంకటస్వామిని రంగంలోకి దించితే….బైరెడ్డి కుటుంబం చిన్న బిచ్చన్నను పోటీకి నిలిపింది. ఆ ఎన్నికల్లో లబ్బి వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 వరకు బైరెడ్డి కుటుంబం హవా నడిచినా…ఆ తర్వాత ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గౌరు కుటుంబం నిలబెట్టిన ఐజయ్య గెలుపొందారు. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన బైరెడ్డి తమ్ముడి కొడుకు సిద్ధార్థరెడ్డి
నియోజకవర్గంలో తన మార్కు చూపిస్తున్న సిద్ధార్థరెడ్డి
గౌరు కుటుంబానికి చెక్‌ పెట్టేందుకు సిద్ధార్థరెడ్డి విశ్వప్రయత్నాలు

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరితే.. గౌరు వెంకటరెడ్డి కుటుంబం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో  వైసీపీలో కొనసాగుతోంది. బైరెడ్డి, గౌరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో వైరం ఉంది. అలాంటి సమయంలో బైరెడ్డి తమ్ముడి కొడుకు సిద్ధార్థరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాదు సిద్దార్థరెడ్డి.. నియోజకవర్గంలో తన సొంత మార్కు చూపిస్తున్నారు. సిద్ధార్థరెడ్డిని ప్రజలు ఆదరిస్తుండటంతో.. తమ ప్రాబల్యం ఎక్కడ తగ్గుతుందోనన్న భయంతో గౌరు కుటుంబాన్ని వెంటాడుతోంది. రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న వర్గపోరులో….గౌరు వెంకటరెడ్డి కుటుంబానికి చెక్‌పెట్టేందుకు సిద్ధార్థరెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ….ఆధిపత్య పోరు మాత్రం తారా స్థాయికి చేరింది.

సిద్ధార్థరెడ్డికి ప్రజల్లో పెరుగుతోన్న ఆదరణ
వ్యూహాత్మకంగా వ్యవహరించిన గౌరు వెంకటరెడ్డి
టీడీపీలో చేరిన గౌరు వెంకటరెడ్డి బావ మాండ్ర శివానందరెడ్డి 
నందికొట్కూరు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా శివానందరెడ్డి

బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతుండటంతో….గౌరు వెంకటరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బావ మాండ్ర శివానందరెడ్డిరెడ్డిని టీడీపీలో చేర్పించారు. పార్టీ ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఎమ్మెల్యేగా ఐజయ్య ఉన్నప్పటికీ….శివానందరెడ్డి చెప్పిన పనులు జరుగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే ఐజయ్యకు సిద్ధార్థరెడ్డి బాసటగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీ రెండువర్గాలుగా చీలిపోతే…తెలుగుదేశం పార్టీ మాత్రం దూసుకెళ్తోంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తంగడంచెలో సీడ్ ప్రాసెస్‌ పరిశ్రమ ఏర్పాటుతో పాటు ఉద్యోగాల కల్పించడంపై ప్రజలకు వివరిస్తోంది. 

ఎన్నికల నాటికి వర్గాలుగా విడిపోయిన గౌరు వెంకటరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కలిసిపోతారా ? ఇద్దరి మధ్య జగన్‌ సయోధ్య కుదుర్చుతారా ? సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్‌ ఇస్తుందా..? లేదంటే కొత్త వ్యక్తిని పోటీకి నిలుపుతుందా ? ఈ పార్టీలో ఉన్న కుమ్ములాటలను టీడీపీ క్యాష్‌ చేసుకుంటుందా అన్న తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.