అన్నదాత సుఖీభవ : తిరుమల నిత్యన్నదానం ట్రస్టు విశేషాలు

  • Published By: madhu ,Published On : January 10, 2019 / 02:20 PM IST
అన్నదాత సుఖీభవ : తిరుమల నిత్యన్నదానం ట్రస్టు విశేషాలు

చిత్తూరు : అన్నం పరబ్రహ్మ స్వరూపం .. అన్ని దానాల్లోకెళ్ల అన్నదానం గొప్పది.. వంటి సూత్రాలను టీడీడీ పక్కా ఫాలో అవుతోంది. అన్నపూర్ణమ్మగా మారి లక్షల మంది ఆకలి తీర్చుతోంది. 5 లక్షల మూలధనంతో.. 33 ఏళ్ళ క్రితం  మొదలైన ప్రస్తానం..ఇప్పుడు వందల కోట్లకు చేరుకుంది. వందల కోట్ల విరాలాలతో నిండుకుండలా కళకళలాడుతున్న తిరుమల నిత్యాన్నదానం ట్రస్ట్‌ విశేషాలు….అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఎన్నో వ్యయప్రయాసలతో అలసిసొలసి తిరుమలకు వచ్చే భక్తుల ఆకలి తీర్చే పవిత్ర ఆశయంతోనే మొదలైంది.. తిరుమలలోని అన్నదాన కార్యక్రమం. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒకనాడు 5 లక్షల విరాళాలతో మొదలైన ఈ కార్యక్రమం.. 2018 చివరి నాటికి రూ.1100  కోట్లకు చేరుకుంది.
పలు పథకాలు…
వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నిధులపై వచ్చే వడ్డీ సొమ్ముతో.. విరామం లేకుండా నిత్యం భక్తుల కడుపు నింపుతోంది. అలాగే డబ్బు రూపంలోనే కాకుండా బియ్యం, కూరగాయలు, వంట సామాగ్రి రూపంలోనూ నిత్యం పలు రాష్ట్రాల నుంచి భక్తులు పంపే సరుకుల సహకారంతో.. నిర్విఘ్నంగా టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. నిత్యం భక్తులు హుండీలో వేసే కానుకలే కాకుండా టీటీడీ చేపట్టిన వివిధ ట్రస్టులకు దాతల విరాళాలు అందజేస్తుంటారు. ఇలా అన్నప్రసాద పథకం, ఆరోగ్య వరప్రసాదిని, ప్రాణదానం, గోసంరక్షణ, వేద పరిరక్షణ, బాలమందిరం ట్రస్టు, స్విమ్స్ వంటి పలు పథకాలును ఏర్పాటు చేసి..వాటిని టీటీడీ దిగ్విజయంగా నిర్వహిస్తోంది.
2018లో రూ. 204 కోట్లు…
టీటీడీ చేపట్టిన ట్రస్ట్‌లలో అన్న ప్రసాదం ట్రస్టు అత్యంత ప్రాధానమైంది. 2018లో శ్రీవారి ట్రస్టుల్లోకి మొత్తం రూ. 204 కోట్లు వచ్చి చేరాయి. 2017తో పోలిస్తే ఈ మొత్తం 27 కోట్లు అధికం. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టే వివిధ ట్రస్టుల్లోకి 2018లో రూ.204.65 కోట్లు విరాళాలు అందగా .. ఇందులో ఒక్క అన్నప్రసాదం ట్రస్టుకే రూ.99 కోట్లు చేకూరడం విశేషం. ట్రస్టుల వారీగా పరిశీలిస్తే 2018 జనవరి నుంచి డిసెంబరు వరకు  ఎస్వీ అన్నప్రసాదం టస్టుకు రూ.99.38 కోట్లు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదనికి రూ.39.97 కోట్లు, బర్డ్‌కు రూ.13.41 కోట్లు, ఎస్వీ గోసంరక్షణకు రూ.14.66 కోట్లు, ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.12.78 కోట్లు, ఎస్వీ సర్వశ్రేయ నిధికి  రూ.7.53 కోట్లు, ఎస్వీ విద్యాదానానికి రూ.8.36 కోట్లు, ఎస్వీ వేద పరిరక్షణకు రూ.5.44 కోట్లు, శ్రీనివాస శంకర నేత్రాలయకు రూ.2.14 కోట్లు, హేరిటేజ్‌ అండ్‌ ప్రిజర్వేషన్‌కు రూ.98 లక్షలు అందాయి. మొక్కవోని దీక్ష .. దాతల ఊదారత.. అన్నింటికీ మించి స్వామి ఆశీర్వాద ఫలం ఉండటం వల్లే అంతా కడుపునిండా అన్నం తింటున్నారని .. భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.