ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి : బాలుడికి గాయాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో బస్సులు పోలీస్ సెక్యూరిటీతో నడిపిస్తోంది. ఈ క్రమంలో పోలీస్ సెక్యూరిటీతో వికారాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. బస్సు అద్దాలు పగిలిపోయాయి. తరువాత దుండగులు బైక్ పై పరారయ్యారు.ఈ దాడిలో బస్సు అద్దాలు పగిలి..ప్రయాణీకులకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న క్రమంలో వారే బస్సుపై రాళ్లతో దాడి చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మరోపక్క పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లేపల్లి ప్రధాని రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై ఓ వ్యక్తి రాళ్లు విసిరాడు. పెద్దపల్లి నుంచి భూపాల పల్లి వెళ్తున్న బస్సుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ బాలుడి తలకు గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం పోలీసులు సెక్యూరిటీతో బస్సులను నడిపిస్తున్నందుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులే దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇటువంటి ఘటనలతో ప్రయాణీకులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.