టీడీపీకి షాక్: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి మాజీ మంత్రి

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసిన నాయకుల్లో మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి ఒకరు. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన.. టీడీపీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇదంతా ఎప్పుడో జరిగింది. అయితే లేటెస్ట్‌గా ఆది నారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ కండువా కప్పిన నడ్డా సాదరంగా ఆది నారాయణ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఆదినారాయణరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది, తర్వాతి కాలంలో టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. టీడీపీలో కీలక నేతగా ఉన్న ఆయన ఇప్పుడు పార్టీని వీడారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆది నారాయణ రెడ్డి, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ గూటికి చేరకున్నారు.
కడప జిల్లాలో టీడీపీకి బలం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో కూడా కడప జిల్లాలో పది సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆది నారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి, వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు.
అయితే, వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన తర్వాత ఆది జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని కాదని టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకుని జగన్ పైన అనేక రకాలుగా ఆరోపణలు చేసిన ఆది తిరిగి వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరకు మాత్రం ఆది బీజేపీలోకి చేరారు.