ఎమ్మెల్యే దౌర్జన్యం : రెచ్చిపోయిన మాధవనాయుడు

  • Published By: madhu ,Published On : February 11, 2019 / 01:30 AM IST
ఎమ్మెల్యే దౌర్జన్యం : రెచ్చిపోయిన మాధవనాయుడు

పశ్చిమగోదావరి : జిల్లా నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రెచ్చిపోయారు. వివాదంలో ఉన్న స్థలంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు యత్నిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిపల్లి గ్రామంలోని పంచాయతీ భవన వివాదం కోర్టు పరిధిలో ఉంది. 2009లో పంచాయతీ కార్యాలయానికి ఓ దాత ఐదు సెంట్ల భూమి ఇచ్చారు. అప్పటి ఎమ్మెల్యే ప్రసాదరాజు హయాంలో 13 లక్షల నిధులతో భవనాన్ని నిర్మించారు. అక్కడే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

అయితే.. తాజాగా ఆ స్థలం పక్కనే ప్రస్తుత ఎమ్మెల్యే మాధవనాయుడు రెండెకరాల స్థలం ఉంది. దీంతో ఆ స్థలంలోకి పంచాయతీ భవనాన్ని తరలించేందుకు యత్నిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.  దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే నన్నే అడ్డుకుంటారా అంటూ రెచ్చిపోయి.. గ్రామస్తులపై చేయి చేసుకున్నాడు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఈ గొడవతో సరిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రౌడీలా ప్రవర్తించాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించిన తమపైనే ఎమ్మెల్యే రౌడీలా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.