వైసీపీలో పండు రవీంద్రబాబు : బాబు కరెక్టు సీఎం కాదు

  • Published By: madhu ,Published On : February 18, 2019 / 09:57 AM IST
వైసీపీలో పండు రవీంద్రబాబు : బాబు కరెక్టు సీఎం కాదు

ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల ఏపీకి ఏమి లాభం జరగదని..అసలు ముఖ్యమంత్రి పదవికి అతను అనర్హుడని ఎంపీ పండుల రవీంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. బాబు ఉన్నంత వరకు హోదా..ప్యాకేజీ ఏమీ రాదని..కేవలం మట్టి..నీళ్లు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం లోటస్ పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్‌ను కలిసి రవీంద్రబాబు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఓ సారి బీజేపీ ఒడిలో..మరోసారి కాంగ్రెస్ ఒడిలో కూర్చొనే బాబు వల్ల పార్టీలో ఉన్న తమకే ఇబ్బందిగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనర్హుడని…ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ దగ్గరకు వెళ్లి తెలంగాణాలో భంగపాటుకు గురయ్యారని గుర్తు చేశారు. అమలాపురం నుండి మరోసారి పోటీ చేయాలని భావించినా..టీడీపీ అధినేత బాబు క్లారిటీ ఇవ్వలేదు. దీనితో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేసి జగన్ చెంత చేరారు. ఇప్ప‌టికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేష్… టీడీపీ పార్టీని వీడారు. 

అమ‌లాపురం నుంచి 2014 ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచారు. ప‌శ్చిమగోదావ‌రి జిల్లాకు చెందిన ఈయన ఐఆర్ఎస్ అధికారి. ఢిల్లీలో ప‌ద‌వి వ‌దులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 
మొద‌టిసారి పోటీ చేసి నేరుగా ఎంపీగా పార్ల‌మెంటులో అడుగుపెట్టారు. 
ఐదేళ్లుగా ప‌లుమార్లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చల్లోకెక్కారు.