ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి : హైదరాబాద్‌కు కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…ప్రాజెక్టుల బాట ముగిసింది. గత రెండు రోజులుగా ఆయన వివిధ ప్రాజెక్టులను సందర్శించి..పరిశీలించిన ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన మేర యంత్రాలు, కార్మికులను పెంచాలన్నారు. ప్రాజెక్టుల యాత్రలో భాగంగా రెండో రోజూ (2019, జనవరి 2వ తేదీ) కేసీఆర్ పలు ప్రాంతాలను సందర్శించి పనులను సునిశితంగా పరిశీలించారు.
రెండు రోజులు…
తొలిరోజు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌస్ పనులను పరిశీలించారు. అదేరోజు రాత్రి కరీంనగర్ తీగలగుట్టపల్లిలో బసచేసిన ఆయన బుధవారం మళ్లీ కన్నెపల్లి పంపుహౌజ్‌కు చేరుకున్నారు. రెండోరోజు మేడిగడ్డ బరాజ్ నుంచి అన్నారం బరాజ్‌లోకి తరలించడానికి కన్నెపల్లి నుంచి అన్నారం వరకు అడవిలో 13. 4 కిలోమీటర్ల పొడవు నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా అన్నారం బరాజ్‌కు చేరుకుని వ్యూపాయింట్ పనులను పరిశీలించారు. మధ్యాహ్నం 1.30కు సుందిళ్ల వెళ్లారు. సుందిళ్ల బరాజ్‌ను, అన్నారం పంప్‌హౌస్‌ను గగనతలం నుంచి వీక్షించారు. సుందిళ్ల దగ్గర హెలిప్యాడ్‌లో దిగి, వ్యూపాయింట్ దగ్గర ఫోటో ఎగ్జిబిషన్ చూశారు. మధ్యాహ్నం రెండున్నరకు సుందిళ్ల పంపుహౌజ్‌కే చేరుకుని పనులను పరిశీలించారు. అక్కడి నుంచి ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట దగ్గర జరుగుతున్న పంపుహౌజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ ఫొటో ఎగ్జిబిషన్‌ను చూశారు.
అధికారులకు క్లాస్…
పనుల తీరుపై అధికారులను, వర్క్ ఏజెన్సీలను నిలదీశారు. లక్ష్య సాధన కోసం అన్ని వనరులతో శ్రద్ధతో సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు. కన్నెపల్లి – అన్నారం మధ్యలో నాలుగుచోట్ల ఆగి పనులను సునిశితంగా పరిశీలించిన ఆయన.. గ్రావిటీ కెనాల్ పక్కన బీటీ రోడ్డు వేయాలని ఆదేశించారు. మార్చి నెలాఖరుకల్లా అన్ని పనులు పూర్తికావాల్సిందేనని సీఎం స్పష్టం చేయగా… కచ్చితగా పూర్తిచేస్తామని ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులు చెప్పారు. ఫిబ్రవరిలో అన్నారం పంపుహౌస్ పూర్తికావాలన్నారు. మార్చి 31 నాటికి కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పంపుహౌస్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత రెండు రోజుల పర్యటన ముగించుకుని కేసీఆర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు.