ఆపరేషన్ ఆకర్ష్ : గులాబీలోకి సండ్ర ?

విపక్షాలను ఆత్మరక్షణలో పడేసేందుకు ప్లాన్
పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు కసరత్తు
ఇతర పార్టీల్లోని బలమైన నేతలను చేర్చుకునేలా వ్యూహం
కారెక్కిన వంటేరు ప్రతాప్‌రెడ్డి
సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్…మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేపింది. విపక్షాలను ఆత్మరక్షణలో పడేసేందుకు పక్కా ప్లాన్ రచిస్తోంది. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే విపక్ష పార్టీలకు చెందిన నేతలను కారెక్కించుకుంటున్నారు. కేసీఆర్ ఇలాఖాలో ఇక రాజకీయ ప్రత్యర్థి ఉండబోరు. ఎందుకంటే వంటేరును పార్టీలో చేర్చుకున్న గులాబీ పార్టీ.. అసెంబ్లీలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో చేరే విధంగా పావులు కదుపుతున్నారు.
ఖండిస్తున్న సండ్ర…
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జంప్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని సండ్ర ఖండిస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. పార్టీ మారితే తప్పకుండా తెలియచేస్తానని సండ్ర చెబుతున్నారు. జనవరి 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించినా సండ్ర మాత్రం దూరంగా ఉండడం పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మొత్తానికి కాంగ్రెస్, టీడీపీలను ఎన్నికల్లో కోలుకోలేని విధంగా దెబ్బతీసిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బలమైన నాయకులను చేర్చుకునేందుకు సిద్దమవుతోంది. దీంతో ఆ రెండు పార్టీలలో అయోమయం నెలకొన్నట్లు తెలుస్తోంది.