అప్పడాలు తింటే కరోనా రాదన్న మంత్రికి పాజిటివ్..ఆ అప్పడాలు తినలేదా అంటూ ట్రోలింగ్

భాభిజీ అప్పడాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వ్యాఖ్యానించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కు కరోనా సోకింది. శనివారం ఆయనకు చేసిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావటంతో ఆయన ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా సోకిన కేంద్ర మంత్రుల సంఖ్యా నాలుక్కి చేరింది.
కాగా..అర్జున్ రామ్ మేఘ్‌వాల్ కి కరోనా వైరస్ సోకిందని వార్తలు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. భాబిజీ పాపడ్ తినండి తగ్గిపోతుందని అన్నారు కదా..మరి మీరు ఆ అప్పడాలు తినలేదా? అంటూ కొంతమంది ట్రోలింగ్ చేశారు. మరికొందరు అయ్యో..అందరికీ చెప్పే మీరు ఆ అప్పడాలు తినకుండా కరోనాకు గురయ్యారే..తింటే బాగుండు కదా..మీకు కరోనా పాజిటివ్ వచ్చి ఉండేదికాదు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద తయారు చేసిన భాభిజీ పాపడ్ తింటే నిరోనిరోధక శక్తి పెరుగుతుందని, బాడీలో యాంటీబాడీస్ పెరుగుతాయని..ఈ అప్పడాలు తింటే కరోనా మహమ్మారి దరిచేరదని చెప్పారు. అలా చెప్పిన ఆయనే కరోనా బారిన పడడంతో నెటిజన్లు ట్రోల్ తో ఊదరగొట్టేస్తున్నారు. కాగా..ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కైలాష్ చౌదరి కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే.