ప్రాణాలు తీస్తారా : యురేనియం బాధిత గ్రామాల్లో నిపుణుల బృందం

కడప జిల్లాలో యురేనియం ప్రాజెక్టుపై రగడ కొనసాగుతోంది. వరుసగా రెండోరోజు కేకే కొట్టాలలో నిపుణుల బృందం పర్యటిస్తోంది. గ్రామస్తుల్ని కలిసి వారి అభ్యంతరాలను తెలుసుకుంది. నిపుణుల బృందం ఎదుట జనం తమ గోడు వెళ్లబోసుకున్నారు. యురేనియం కోసం ప్రాణాలు తీస్తారా అని నిలదీశారు. తాము రోగాలతో ఇంకెన్నాళ్లు మగ్గిపోవాలని ప్రశ్నించారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించాలంటూ నిపుణుల బృందాన్ని వేడుకున్నారు జనం.
పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలోని ఎమ్.తుమ్మలపల్లె వద్ద… 2008లో రూ. 11 వందల 4 కోట్లతో యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. 2012 ఏప్రిల్ 20న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కుమార్ బెనర్జీ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ముడి యురేనియాన్ని శుద్ధి చేస్తూ వస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ దీనిని శుద్ధి చేసే సమయంలో పూర్తిస్థాయిలో యంత్రాల్లో ఫిల్టర్ కాకుండా కొంతమేర వ్యర్థాల్లో పోతోంది. ఇది ఇంజనీర్లకు సవాల్‌గా మారింది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్లాంటు నుంచి విడుదలవుతున్న కాలుష్యంతో వాతావరణం దెబ్బతింటోంది. సమీప గ్రామాల్లో మట్టి, నీరు కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్లు అధ్యయనంలో తేలింది. భార లోహాలు పరిమితిని మించి ఎక్కువస్థాయిలో ఉన్నట్లు తేలింది. ఈ భార లోహాలు ఏడు రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని… వీటిలో కేన్సర్, శ్వాసకోశ, మూత్రపిండ సంబంధ వ్యాధులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు పరిశోధనకారులు. దీనిపై స్పందించిన సీఎం జగన్ వెంటనే అధ్యయన కమిటీని వేశారు. దీంతో రంగంలోకి దిగిన కమిటీ ప్లాంట్ పరిసర ప్రాంతాల పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. నివేదికను తయారుచేసి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది.
Read More : కాణిపాకం ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం