మేయర్ పదవి సాక్షిగా విశాఖను గెలవడమే వైసీపీ లక్ష్యం

రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలన్నింటికీ విశాఖ కీలకం. దీనిపై పట్టు సాధించడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు నిత్యం సమరం సాగిస్తుంటాయి. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. మంత్రి అవంతి శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ మధ్య సవాళ్ల పర్వం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. స్థానిక ఎన్నికల సమరం ముంచుకొస్తుండటం, రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్‌గా ఉన్న గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా ఈ ఇద్దరి నేతలు రెచ్చిపోతున్నారు. రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఎవరికి వారే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.
అవంతి శ్రీనివాస్‌కు మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పాటు విశాఖ నేతలందరినీ చీటికిమాటికీ తిట్టిపోస్తున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఈ మధ్యనే ఫైరింగ్ మొదలుపెట్టారు. టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. అప్పటి నుంచి అవంతిపై దూకుడు చూపిస్తున్నారని అంటున్నారు. దమ్ముంటే రాజకీయంగా తేల్చుకుందాం రమ్మని సవాల్ చేస్తున్నారు. ఈ సవాళ్ల రాజకీయం విశాఖ నగరంలో వేడి పుట్టిస్తోంది.
జిల్లాలోని రూరల్ ప్రాంతం అంతా వైసీపీ ప్రభంజనం సృష్టించినా నగరంలో మాత్రం అంత ప్రభావం చూపించలేకపోయింది. నగరంలో నాలుగు దిక్కుల నాలుగు స్తంభాల్లా టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో నగరంలో వైసీపీకి దిక్కు లేకుండా పోయింది. ఎలాగైనా నగరంలో తమ ముద్ర వేయాలని ఎప్పటి నుంచో ప్రయాత్నాలు సాగిస్తున్నారు వైఎస్సార్సీపీ. ఇందుకు మేయర్ పీఠం వేదికయ్యింది. మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి అవంతి శ్రీనివాస్ నగరంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రివ్వూలు పెడుతూ సీఎం జగన్‌కు మేయర్ పీఠం గిప్ట్‌గా ఇవ్వాలని కార్యకర్తల్లో జోష్ నింపాలని చూస్తున్నారట.
నగరంలో టీడీపీకి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్న అవంతికి మూడు రాజధానుల ఆయుధం కలసి వచ్చిందంటున్నారు. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని, ఒక్క సీటైనా గెలవలేరని, వార్ వన్ సైడే.. అంటూ సవాళ్లు విసరడం మొదలుపెట్టారు అవంతి. చాలాకాలంగా అవంతి ఇదే సవాల్‌ను చేస్తున్నా సరే.. టీడీపీ నుంచి స్పందన ఉండేది కాదు. కనీసం మంత్రికి పార్టీ తరపున గట్టిగా సమాధానం చెప్పే నేత కూడా లేకుండా పోయారు. ఇప్పుడు వాసుపల్లి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అవంతికి సవాల్ విసరడం మొదలుపెట్టారు.
ఈ మధ్య కాలంలో అవంతికి దీటుగా వాసుపల్లి నిలుస్తున్నారు. గత ఎన్నికల గురించి కాదు త్వరలో జరగబోయే జీవీఎంసీ ఎన్నికల్లో తేల్చుకుందాం రావాలంటూ ప్రతి సవాల్ విసురుతున్నారు. విశాఖలో జరుగుతోన్న ల్యాండ్ పూలింగ్‌పై ప్రజల్లో నెలకొంటున్న వ్యతిరేకత, ఎగ్జిక్యూటివ్ రాజధాని విషయంలో కూడా ఉన్న భిన్నాభిప్రాయాలన్నీ కలసి వస్తాయన్నది వాసుపల్లి ఆలోచనగా ఉందంటున్నారు. అందరికీ ఇల్లు పేరుతో గ్రేటర్ విశాఖ పరిధిలో ఆరు వేల ఎకరాల భూమి సేకరణపై రైతులు ఎదురుతిరగడం, ఎగ్జిక్యూటివ్ రాజధాని పేరుతో రాయలసీమ ఫ్యాక్షనిజం పెరుగుతుందన్న వాదన, పెన్షన్లు కొంతమంది వృద్ధులకు రద్దవడం వంటి అంశాల నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని భావిస్తున్నారు.
జీవీఎంసీ ఎన్నికలు జరిగితే ఘన విజయం సాధించడం ఖాయమని వాసుపల్లి గట్టి నమ్మకంతో ఉన్నారట. ఈ ధీమాతోనే మంత్రి అవంతికి నేరుగా సవాల్ విసురుతున్నారట. నాలుగు దిక్కుల్లో ఉన్న నలుగురం ఎమ్మెల్యేలం గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని సత్తా చూపుతామని, దమ్ముంటే వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు. అంతేకాక బీజేపీ, జనసేన కలిసిపోటీ చేయడం, వైసీపీ ఒంటరిపోరు కావడంతో టీడీపీ కార్యకర్తలు జారిపోకుండా చూసుకొనే పనిలో కూడా గట్టిగా కృషి చేస్తున్నారని అంటున్నారు. ఈసారి పోటీ గట్టిగానే ఉంటుందని జనాలు అనుకుంటున్నారు.