మదన్‌మోహన్ రావుకు తలనొప్పి : జహీరాబాద్ కాంగ్రెస్‌ నేతల తీరు మారేనా

  • Published By: madhu ,Published On : March 28, 2019 / 07:09 AM IST
మదన్‌మోహన్ రావుకు తలనొప్పి : జహీరాబాద్ కాంగ్రెస్‌ నేతల తీరు మారేనా

Updated On : March 28, 2019 / 7:09 AM IST

కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిందా ప్రాంతం. కానీ.. ఇప్పుడు గులాబీ జెండా రెపరెపలాడుతోంది. ఈసారి కూడా సిట్టింగ్ సీటు తమదే అని కారు పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే.. జహీరాబాద్‌లో మళ్లీ జెండా పాతాలని చూస్తోంది కాంగ్రెస్. అయితే.. అంతర్గత విభేదాలు హస్తం పార్టీని పరేషాన్ చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో మెదక్, సిద్ధిపేట పార్లమెంటు నియోజకవర్గాలు ఉండేవి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్ నియోజకవర్గం జహీరాబాద్ ఏర్పడగా సిద్ధిపేట రద్దయ్యింది. సిద్దిపేట పరిధిలోని అసెంబ్లీ స్థానాలను కొన్ని మెదక్ పార్లమెంట్ పరిధిలోకి, ఇంకొన్నింటిని జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి మార్చారు. 

కొత్తగా ఏర్పడిన జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. ఆ పార్టీ తరపున సురేశ్ షెట్కార్ టీఆర్ఎస్‌పై 17వేల 407 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత.. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి చెందిన బీబీ పాటిల్.. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌పై లక్షా 44వేల 631 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బీబీ పాటిల్ అభ్యర్థిగా ఉండగా.. కాంగ్రెస్ నుంచి మదన్‌మోహన్ రావు బరిలో ఉన్నారు. 

ఎలాగైనా సరే మళ్లీ జహీరాబాద్‌ను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే నామినేషన్లు వేశారు కానీ.. ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు అసలు ప్రచారం కూడా ప్రారంభించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నేతల పరిస్థితి ఉంది. నేతల మధ్య అస్సలు సఖ్యత కనిపించడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ కేవలం సంగారెడ్డి నియోజకవర్గాన్ని మాత్రమే గెల్చుకుంది. ఇక.. జిల్లాలో సీనియర్ నేతగా పేరున్న సునీతా లక్ష్మారెడ్డి త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి గతంలో బాగారెడ్డి ఎంపీగా వరుసగా విజయాలు సాధించారు. ప్రస్తుతం ఆయన కుమారులు పార్టీలోనే ఉన్నా అంతగా ప్రాధాన్యం లభించకపోవడంతో దూరంగా ఉంటున్నారు. ఇక మరో సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా అడ్రస్ లేకుండా పోయారు. టికెట్ ప్రకటించినప్పటి నుంచి నామినేషన్ల వరకు అస్సలు కనిపించలేదు. పత్రాలు సమర్పించే రోజు మాత్రమే కనిపించిన ఆయన.. ఆ తర్వాత సైడైపోయారు. మరోవైపు.. మాజీ ఎంపీ సీనియర్ నేత సురేష్ షెట్కార్ జహీరాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డారు. పార్టీపై గుర్రుగా ఉన్న ఆయన అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

సీనియర్లను కలుపుకొని వెళ్లడం మదన్‌మోహన్ రావుకు తలనొప్పి వ్యవహారంగా మారింది. కొందరు సీనియర్లను కూడా ఆయన ఇప్పటికీ కలవలేదు. ఇప్పటికే పార్టీలో గ్రూపు విభేదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లాపడిందనే వాదన ఉంది. ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పులేదు. ఇది ఇలాగే కొనసాగితే… పార్లమెంట్ స్థానంలో ఎలా విజయం సాధిస్తామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా.. అందరినీ కలుపుకొని వెళ్ళాలని అందరూ కలసి రావాలని లేకుంటే మరోసారి పరాజయం తప్పదని అంటున్నారు. మరి జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతల తీరు మారుతుందో లేదో చూడాలి.