చైతన్య రథం రెడీ : చంద్రబాబు రోడ్ షోలు

చైతన్య రథం రెడీ : చంద్రబాబు రోడ్ షోలు

చైతన్య రథం రెడీ : చంద్రబాబు రోడ్ షోలు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు మార్చి 20, బుధవారం నుంచి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో పదమూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి పార్టీ శ్రేణులను సన్నద్దం చేశారు. నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు డిసైడయ్యారు. బహిరంగ సభలు, రోడ్‌షోలతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ఇందుకు చైతన్య రథాల పేరిట ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసుకున్నారు.

నాలుగు రోజుల పాటు జిల్లాలను చుట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. క్షేత్రస్థాయి ప్రచారానికి రెడీ అయ్యారు. ఇవాళ్టి నుంచి సభలు, రోడ్‌షోలు నిర్వహించున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇందు కోసం నాలుగు ప్రత్యేక ప్రచార వాహనాలను పార్టీ సిద్ధం చేసింది. వీటిలో మూడింటిని చంద్రబాబు రోడ్‌షోల కోసమే ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు పంపారు. మరో ప్రచార రథాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ వినియోగించనున్నారు. నాడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు తన ప్రచార రథానికి పెట్టిన చైతన్య రథం పేరునే వీటికీ పెట్టారు.

ఈ ప్రచార రథాలను బహుళ ప్రయోజనాల కోసం చంద్రబాబు వినియోగించనున్నారు. ఎన్నికల ప్రచార పర్వం ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలను చుట్టాలన్నది అధినేత ఆలోచన. ఉదయం వేళల్లో బహిరంగ సభలు నిర్వహించినా…., సాయంత్రం వేళల్లో ఈ చైతన్య రథాల ద్వారా రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో బహిరంగ సభల కంటే రోడ్‌ షోలే అనువైనవని టీడీపీ అధినేత యోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 సభలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.

బుధవారం సాయంత్రం ఏలూరులో నిర్వహించే రోడ్‌షో ద్వారా ఈ చైతన్య రథాలను చంద్రబాబు లాంఛనంగా ప్రచార పర్వంలోకి తీసుకురానున్నారు. ఈ వాహనాన్ని అనుసరించి మరో రెండు వాహనాలు సౌండ్‌, లైటింగ్‌ కోసం నడవనున్నాయి. గురువారం విజయనగరం జిల్లాలో శుక్రవారం అనంతపురం జిల్లాలో బాబు రోడ్ షో లు నిర్వహించనున్నారు. ప్రచార రథాలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ప్రజల ఒత్తిడి తట్టుకునేలా పటిష్ట భద్రతా ప్రమాణాలతో వాహనాల రూపకల్పన చేశారు.

×