తగ్గిన ఆదాయం, పెరిగిన అప్పులు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ మధ్యంతర సమీక్ష

  • Published By: naveen ,Published On : November 7, 2020 / 12:37 PM IST
తగ్గిన ఆదాయం, పెరిగిన అప్పులు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ మధ్యంతర సమీక్ష

kcr review on state economic situation: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ నేడు(నవంబర్ 7,2020) మధ్యంతర సమీక్ష నిర్వహించనున్నారు. బడ్జెట్ కేటాయింపులు, ఆ తర్వాతి పరిస్థితులతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సంక్షేమ పథకాలకు బ్రేకులు వేయకుండా.. ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దే చర్యలపై దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్‌. ఈ నేపథ్యంలో సీఎం సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది.

అప్పులపైనే ఎక్కువగా ఆధారం:
కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది. రావాల్సిన రాబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడం.. నిధులు సమకూరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తొలి అర్ధ భాగంలో అప్పుల పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ అంశాలపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్‌. 2020 – 2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ఆర్ధిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై పూర్తి స్థాయిలో అర్థికశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

తగ్గిన ఆదాయం, పెరిగిన అప్పులు:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ఆదాయం కేవలం 26.51 శాతం మాత్రమే. అప్పులు బడ్జెట్ అంచనాలకు వ్యతిరేకంగా 78.30 శాతానికి పెరిగాయి. సెప్టెంబర్‌ వరకు సీఏజీ విడుదల చేసిన లెక్కల ప్రకారం లక్షా 43 వేల 151.94 కోట్ల రూపాయలు అంచనా వేస్తే.. కేవలం 37 వేల 949.84 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. రాబోయే ఆరు నెలల కాలంలో మిగిలిన 73.49 శాతం ఆదాయాన్ని పొందడం దాదాపు అసాధ్యం అని ఆర్ధిక శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సాయంలో సెప్టెంబర్ వరకు రుణాలు 25 వేల 989.43 కోట్లుగా ఉన్నాయి.

కొత్తగా ఎలాంటి పన్నులు ఉండవు:
ఈ ఏడాది(2020) ఆదాయం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసినా.. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా లోటు బడ్జెట్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్యంతర బడ్జెట్ సమీక్షతో కొన్ని విభాగాల బడ్జెట్ తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టరాదన్న నిర్ణయాన్నీ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

ఇక శనివారం జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై.. ఆదివారం(నవంబర్ 8,2020) మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.