ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాల్సిందే : సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

  • Published By: nagamani ,Published On : August 11, 2020 / 02:21 PM IST
ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాల్సిందే : సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

Updated On : August 11, 2020 / 2:45 PM IST

ఆడపిల్లలకు ఆస్తి హక్కుపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా పంచాల్సిందే అని స్పష్టం చేసింది. ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పించడంతో పాటు..హక్కుదారుగా గుర్తించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించడంపై దాఖలైన పిటీషన్లపై విచారించిన ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది.



2005లో హిందూ వారసత్వ చట్టం-1956లో సవరణలను చేశారు. దీంట్లో భాగంగా..సవరణలతో కూడిన చట్టాన్ని 2005 సెప్టెంబర్ 9వ తేదీన పార్లమెంట్ ఆమోదించింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో కొడుకులతో పాటు కూతుర్లకు కూడా సమాన హక్కు ఉండాలని దీంట్లో పొందుపరిచారు. దీనికి సంబంధించిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తాజాగా తన తీర్పును వెలువరిస్తూ..1956 నాటి హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేపట్టే నాటికి కుటుంబంలో ఆడపిల్ల పుట్టినా, పుట్టకపోయినా.. ఈ సవరణ వర్తిస్తుందని..దీనికి ఎటులాంటి కొలమానం లేదని సుస్పష్టం చేసింది.

చట్టంలో ఉండే సమానత్వాన్ని బట్టి..కుటుంబంలో కూతురు ఉంటే ఈ సవరణ వర్తిస్తుందని, ఆస్తిలో సమాన హక్కు లభిస్తుందని పేర్కొంది. దీనిపై దాఖలైన పిటీషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 11,2020) కొద్దిసేపటి కిందట తీర్పు ఇచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎం ఆర్ షా సభ్యులుగా ఉన్నారు.



విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేస్తూ..కుటుంబంలో కొడుకుతో పాటు సమానంగా కూతుర్లకు కూడా ఆస్తిలో సమాన హక్కును కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాదు..జీవితాంతం కుమార్తె ప్రేమను పంచుతుందనీ..కూతురు జీవితాంతం తండ్రిని ప్రేమిస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. తండ్రి జీవించి ఉన్నా, లేకపోయినా.. కూతురుకు మాత్రం తన జీవితాంతం పుట్టింటితో అనుబంధాన్ని కొనసాగిస్తుందని, ప్రేమాభిమానాలను పంచుతుందని అన్నారు. కాగా ఇటువంటి పిటీషన్‌పై 2016లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం కొంతమంది పలు సందేహాలను వ్యక్తపరిచారు. ఈ సందేహాలకు ఇప్పుడు ఇచ్చిన సంచలన తీర్పుతో సుప్రీంకోర్టు తెరదించింది.