అన్నపూర్ణా దేవి అలంకారంలో దుర్గమ్మ 

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 03:10 AM IST
అన్నపూర్ణా దేవి అలంకారంలో దుర్గమ్మ 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ దుర్గాదేవీ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజున దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకాంలో భక్తులకు దర్శనమిస్తోంది. ముల్లోకాల్లోని ప్రాణుల కడుపు నింపే అమ్మగా పూజలందుకుంటోంది. సాక్షాత్తు పరమశివుడికే భిక్షం వేసిన పరాశక్తి అన్నపూర్ణాదేవిగా భక్తుల మొక్కలు అందుకుంటోంది. 

అన్నంను ప్రసాదించే మాతృమూర్తి అన్నపూర్ణా దేవి. ఆహారం లేనిదే జీవులకు మనుగడ లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వ జీవనాధారం. లోకంలో జీవుల ఆకలితీర్చటం కన్నా మిన్న ఏదీలేదు. అందుకే అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదంటారు. ఈ అలంకారంలో అమ్మవారు బంగారు పాత్రను ఎడమ చేతితో పట్టుకుని, సమస్త ప్రాణికోటికి అన్నాన్ని ప్రసాదించే విధంగా కొలువుదీరి ఉంటారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పువ్వులతో ఈరోజు అమ్మను పూజించాలి. 
అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న అమ్మను దర్శించుకుని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. అన్నపూర్ణాదేవిగా అలంకాలంలో పరాశక్తిని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, వాక్ సిద్ధి, శుద్ది కలుగుతాయమని వేదాలు చెబుతున్నాయి. అమ్మవారు ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలకు అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తిగా స్వయంగా తన బిడ్డలకు అన్నం పెట్టి ఆకలితీర్చే అమ్మగా కరుణాకటాక్షాలకు సిద్ధింపజేస్తుంది. పరిపూర్ణమైన చిత్తంతో అంటే ఆలోచనతో ఆరాధించిన వారి సమస్త పోషణాభారాన్ని ఆమే స్వయంగా చూసుకుంటుంది. 
ఓం శ్రీం, హ్రీం క్లీం నమో భగవత్యన్నపూర్ణేశి మామాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రాన్ని జపించి అమ్మకు నివేదన చేయాలి.