కేసీఆర్ వెయ్యి కోట్లు చంద్ర‌బాబు చూశాడా

10TV Telugu News

తాడిపత్రి : తెలంగాణ సీయం కేసీఆర్ తనకు వెయ్యికోట్లు ఇవ్వటం చంద్రబాబు నాయుడు చూశారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తన పార్లమెంట్ సభ్యులతో మద్దతిస్తానని కేసీఆర్ అంటే, వైసీపీ కిమద్దతిచ్చినట్లు చంద్రబాబు అబద్దాలు ప్రచారంచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ……నిసిగ్గుగా  అబద్దాలు ఆడటం చంద్రబాబు నాయుడుకు అలవాటయి పోయిందని జగన్ మండిపడ్డారు.

చంద్రబాబుకు పార్టనర్ గా ఓ యాక్టర్ ఉన్నాడని ఆయన ఏమంటున్నారో  రోజు వింటున్నామని జగన్ అన్నారు.  చంద్రబాబు నాయుడు  కొత్త పార్టీలు పుట్టించి వైసీపీ ని పోలిన గుర్తులు ఇప్పిస్తారని జగన్ చెప్పారు. వీరంతా కలిసి రోజూ జగన్…. జగన్… అని నామ జపం చేస్తున్నారని అన్నారు. వైసీపీ గెలుస్తుందనే భయంతోనే చంద్రబాబు ఈరకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

తెలంగాణలో ఉన్న తెలుగువారిలో భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకమని జగన్ విమర్శించారు. తన ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు తనపై దుష్ప్రాచారాలు చేయిస్తున్నారని జగన్ అన్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్ది చంద్రబాబు   చేసే కుట్రలు,మోసాలు ఎక్కువవుతాయని,  ఓటర్లు చంద్రబాబు మాయలకు లొంగవద్దని జగన్ హితవు పలికారు.  45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం అని జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తామని  జగన్ తెలిపారు.

×