పాల్వంచలో పొల్యూషన్ అన్ లిమిటెడ్

  • Published By: madhu ,Published On : March 6, 2019 / 02:32 PM IST
పాల్వంచలో పొల్యూషన్ అన్ లిమిటెడ్

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..విశ్వనాధ పలుకై.. అంటూ పాట వినగానే కిన్నెరసాని అందాలు కళ్లముందు కదలాడుతాయి. మనసును పరవశింపజేసే ప్రకృతి సౌందర్యం కిన్నెరసాని సొంతం. ఒకవైపు అభయారణ్యంలో దుప్పుల గెంతులు, హంసల హోయలు, బాతుల చప్పుడు. నిండుకుండలా రిజర్వాయర్.. సరస్సు మధ్యలో ద్వీపం అందులో పచ్చని అడవి. గజిబిజీ నగర జీవితానికి దూరంగా పచ్చని పావడ గట్టినట్లు ఉండే పరిసరాలతో.. మనసును సేదతీర్చేలా ఉండే కిన్నెరసానిని ఓసారి చూడాలనిపిస్తుంది. 

అయితే.. అక్కడికి వెళ్లాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు కూతవేటు దూరంలో కిన్నెరసాని ఉంది. ఓవైపు ప్రకృతి పచ్చదనం..మరోవైపు పొల్యూషన్ ముక్కుపుటాలను అదరగొడుతోంది. లక్షకుపైగా జనాభాతో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతంలో… ఓవైపు కేటీపీఎస్… మరోవైపు.. నవభారత్, ఎన్ఎండీసీ కర్మాగారాలున్నాయి. వీటితో పాటు చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి నిత్యం భారీగా కాలుష్యం వెలువడుతోంది. దుమ్ము కూడా భారీనే ఉంటుంది. అధికారుల అజమాయిషీ లేకపోవడంతో ఎక్కడ చూసినా కుప్పలుగా పేరుకుపోయిన చెత్త దర్శనమిస్తోంది. దీనివల్ల అనేక రకాల వ్యాదులు ప్రబలుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే పొగ.. బూడిదతో శ్వాసకోశ వ్యాధులు వస్తుంటే.. వ్యర్థాల వల్ల చర్మ సంబంధ వ్యాదులు పెరిగిపోతున్నాయి. ఇక్కడున్న హాస్పిటల్స్ మెడికల్ మెటీరియల్‌ను ఎక్కడికక్కడే పాడేస్తున్నాయి. 

పట్టణంలోనే స్క్రాప్ షాపులుండడం పరిశ్రమల నుంచి వచ్చే తుక్కు మొత్తం ఇక్కడికే చేరుతోంది. స్క్రాప్‌లోని దుమ్ము, దూళి.. వ్యర్ధాల నుంచి వచ్చే పౌడరు గాలిలో కలుస్తోంది. వర్షాలు పడితే అదంతా తడిసి… భూగర్బ జలాలు కలుషితమవుతున్నాయి. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతం కాబట్టి అధికారులు పాల్వంచపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.