పూర్వ వైభవం : తెరుచుకున్న పేపరు మిల్లు 

  • Published By: chvmurthy ,Published On : February 24, 2019 / 03:16 PM IST
పూర్వ వైభవం : తెరుచుకున్న పేపరు మిల్లు 

కాగజ్ నగర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో ఉన్న సిర్పూరు పేపరు మిల్లులో మళ్లీ సందడి మొదలైంది. నాలుగున్నరేళ్ల క్రితం మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లు పునః ప్రారంభమైంది. మిల్లు ప్రారంభమైన  పదిహేను రోజుల్లోనే కాగితం తయారీ ఊపందుకుంది. పేపర్‌ ఎగుమతికి సిద్ధం అవుతోంది. నాలుగేళ్ళుగా బోసిపోయిన మిల్లు పరిసరాలు ప్రస్తుతం కర్ర దిగుమతి, పేపరు ఎగుమతులతో సందడి నెలకొంది. మూగబోయిన మిల్లు సైరన్ మళ్ళీ కూత కూస్తోంది. 

1938లో నిజాం కాలంలో స్థాపించిన ఈ మిల్లును 1950లో బిర్లా గ్రూప్ టేకోవర్ చేసింది. అప్పటి నుండి నిరాటంకంగా మిల్లులో ఉత్పత్తి కొనసాగింది. లాభాలు గడిస్తూ అద్భుతంగా నడిచిన మిల్లు.. గత యాజమాన్యం తప్పటడుగులతో తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. పేపరు మిల్లు సొమ్ముతో ఇతర బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టడంతో నష్టం వచ్చింది. దీంతో 2007-08 లో యాజమాన్యం బ్యాంకులలో రుణాలు తీసుకుంది. ఆ తర్వాత మిల్లులో నష్టాలు  చూపుతూ 27 సెప్టెంబరు 2014 న దీర్ఘకాలిక షట్ డౌన్ పేరిట మిల్లు ఉత్పత్తిని నిలిపివేసింది.  420 కోట్ల రూపాయల అప్పు చెల్లించాలని అక్టోబర్ 2016 లో మిల్లును ఐడిబిఐ బ్యాంకు స్వాధీనం చేసుకుంది.

పేపర్ మిల్లు మూతపడటంతో సుమారు నాలుగు వేల మంది కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఉపాధి లేక నాలుగేళ్ల పాటు వలస కూలీలుగా దుర్భరమైన జీవితాన్ని గడిపారు. మూతపడిన పేపరు మిల్లు పునరుద్ధరించాలని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్‌తో కార్మికుల సమస్యలను వివరించారు. అటు కేసిఆర్ ఇటు కేటిఆర్ లు మిల్లు పునరుద్ధరణ కోసం పట్టుబిగించారు. దీంతో మిల్లును తీసుకోవాడానికి జేకే పేపరు యాజమాన్యం ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా  2018, మార్చి 21 న పేపరు మిల్లుకు పలు రకాల రాయితీలు కల్పిస్తూ జీవో నెం.18ని విడుదల చేసింది. దీనికి తోడు 19 జూలై 2018 రోజున ట్రిబ్యునల్‌ తీర్పు కూడా మిల్లు పునరుద్ధరణకు అనుమతించింది. దీంతో మిల్లు తీసుకోవడానికి జేకే యాజమాన్యానికి మార్గం సుగమం అయింది.  2018 ఆగస్టులో జేకే యాజమాన్యం మిల్లును స్వాధీనం చేసుకొని మిల్లులోని యంత్రాలను మరమ్మతు చేయించింది.

ఇక 2019 ఫిబ్రవరి 7న….  7వ నంబర్‌ మిషన్‌లో పేపర్ ఉత్పత్తిని ప్రారంభించారు. కొద్ది రోజులలోనే పేపరు ఉత్పత్తి ఊపందుకుంది. ముందుగా పల్ప్ కొనుగోలు చేసి దాంతో పేపరు ఉత్పత్తి చేస్తున్నారు. చిప్పర్ హౌసింగ్ మరమ్మతులు పుర్తికాగానే ఇక్కడే పల్ప్ తయారు చేస్తామంటున్నారు అధికారులు. త్వరలోనే 8వ నంబర్‌ మిషన్‌ కూడా ప్రారంభించేందుకు జేకే యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. ఇదే ఏడాదిలో మరో రెండు మిషన్లను కూడా ప్రారంభించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మూతపడ్డ మిల్లు మళ్లీ తెరుచుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.