మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజు ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది.

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 10:44 AM IST
మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజు ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన సీఎం జగన్‌ కు సంచయిత గజపతిరాజు కృతజ్ఞతలు తెలిపారు. మాన్సాస్‌ ట్రస్ట్‌కు సంబంధించి జరిగిన ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా నిరంకుశంగా మాన్సాస్‌పై పెత్తనం చెలాయిస్తున్నవారికి గట్టి దెబ్బ తగిలిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

sanchaita

విద్యా అభివృద్ధి ధ్యేయంగా మాన్సాస్‌ ఆవిర్భావం
1958 సంవత్సరంలో దివంగత పివిజి రాజు నెలకొల్పిన మాన్సాస్‌ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958సంవత్సరంలో పివిజి రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994 సంవత్సరంలో పివిజి రాజు మరణం చెందిన తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతలు తీసుకున్నారు. అశోక్‌ కుమార్తె అథితి గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌గా తెరపైకి వచ్చారు. 13వేల ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగిన మాన్సాస్‌ సంస్థ చైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఇప్పటి వరకూ ఉన్నారు. బుధవారం ఉదయం సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానానికి వెళ్లి ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. సింహాచలం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌ పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమెకు ఘనత దక్కింది.

mansas

ఎమ్మెల్యే కోలగట్లతో సంచయిత గజపతిరాజు భేటీ
సింహాచలం నుంచి సంచయిత గజపతిరాజు నేరుగా విజయనగరం చేరుకుని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో పాటు పలువురు పార్టీ నాయకులతో మాట్లాడారు. అనంతరం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, యువజన నాయకుడు ఈశ్వర్‌ కౌశిక్‌తో కలిసి విజయనగరం కోటలోని మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. పివిజి రాజు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి మాన్సాస్‌ ట్రస్ట్‌ బాధ్యతలను చైర్‌పర్సన్‌ హోదాలో స్వీకరించారు. త్వరలోనే ట్రస్ట్‌ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించి, అన్ని విషయాలపై చర్చిస్తామని సంచయిత గజపతిరాజు స్పష్టం చేశారు.

sanchaita meeting

పూసపాటి వంశీయురాలిగా  
సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్లుగా పూసపాటి వంశీయులే కొనసాగుతున్నారు. గతంలో పూసపాటి ఆనందగజపతి రాజు ఉన్నప్పుడు ఆయనే ధర్మకర్తగా ఉండేవారు. ఆయన మరణం తరువాత సోదరుడైన అశోక్‌ గజపతి బాధ్యతలు తీసుకుని నేటి వరకూ కొనసాగారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యులను నియమించింది. విజయనగరం జిల్లాకు చెందిన వారికి దానిలో ప్రాతినిధ్యం కల్పించింది. ఆనంద గజపతి రాజు, అశోక్‌ గజపతి రాజు అన్నదమ్ములైనప్పటికీ రాజకీయంగా ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉండేది. గజపతి రాజు అశోక్‌ టీడీపీలో ఉంటే ఆనంద గజపతి కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేశారు.

gajapatiraja 

మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించిన సంచయిత గజపతి  
ఆనంద గజపతి కుమార్తె సంచయిత గజపతిరాజు ఢిల్లీలో స్థిర నివాసం అయినప్పటికీ విశాఖ ఏజెన్సీలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారిశుధ్ధ్యం, తాగునీటి రంగాల్లో విశిష్ట సేవలందించిన సంస్థలకు ఇచ్చే గూగుల్‌ గ్లోబల్‌ ఇంపాక్ట్‌ చాలెంజ్‌ అవార్డును 2013లో సాధించారు. ఆ విజయంతో వచ్చిన రూ.3 కోట్లను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇరవై గ్రామాలు, మరో ఇరవై స్కూళ్లకు తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీఎం జగన్‌ ఇటీవల తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సంచయిత గజపతి స్వాగతించారు. విజయనగరం గడ్డపై పుట్టిన సంచయిత చెన్నై, కేరళ, ఢిల్లీలో పెరిగి ఇప్పుడు సొంత గడ్డమీద బృహత్తర బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నారు.

mansas  

See Also | ఇది బజారు కాదు…విపక్ష సభ్యులపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం