ఖమ్మం పంచాయతీ : జనవరి 25 పోలింగ్‌కు రెడీ

  • Published By: madhu ,Published On : January 24, 2019 / 12:00 PM IST
ఖమ్మం పంచాయతీ : జనవరి 25 పోలింగ్‌కు రెడీ

ఖమ్మం : రెండో విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా  ముగిసింది. ఇక రెండో విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 14 మండలాలు రెండో విడత పల్లె పోరుకు సిద్ధమయ్యాయి. జనరల్‌ స్థానాలతో పాటు రిజర్వుడ్‌ పంచాయతీల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. పలు పంచాయతీల్లో పోటీ ద్విముఖ, త్రిముఖంగా కొనసాగుతోంది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని 4 మండలాలు, సత్తుపల్లి నియోజకవర్గం మొత్తం, వైరా 2, పినపాక 2, కొత్తగూడెం నియోజకవర్గంలోని ఒక మండలం రెండో విడత ఎన్నికలు జరిగే జాబితాలో ఉన్నాయి. వీటిలో కల్లూరు ఎక్కువ ఓటర్లున్న పంచాయతీ. 10,327 మంది ఓటర్లు దీని పరిధిలో ఉన్నారు. 14 మండలాల్లో సుమారు 50 నుంచి 80 గ్రామ పంచాయతీల్లో పోటీ పోటాపోటీ నెలకొంది. దీంతో అభ్యర్థులు మద్యం, విందులతో ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. 

చుంచుపల్లి మండలంలో ఓ మూడు పంచాయతీల పరిధిలో ఎన్నికలు పోటాపోటీగా మారాయి. స్థానికంగా ప్రధాన పోటీదారుల్లో ఒక్కో అభ్యర్థి ఇప్పటికే రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేశారు. పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, ఏన్కూరు తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి. జనరల్‌ స్థానాల్లో పోరు వేడిని రాజేస్తోంది. పోటీదారులు కొందరు ఓటర్లను నిత్యం మద్యం మత్తులో మునిగేలా చేస్తున్నారు. అశ్వారావుపేట మండలంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో మద్యం ఏరులై పారుతోంది. రిజర్వుడ్‌ స్థానాల్లో  మెజారిటీ పంచాయతీల్లో ఓటు రూ.300 నుంచి రూ.500 వరకు  పలుకుతోంది. పెనుబల్లి మండలంలోని నాలుగు గ్రామాల్లో ఒక్కో ఓటరుకు రూ.500 నుం చి రూ.వెయ్యికి చేరేలా ఉంది. తల్లాడ మండలంలోని ఓ కుగ్రామంలో ఓటరు సుమారు 700 లోపే ఉంటారు. కానీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.