హైదరాబాద్ జూపార్క్ లో చింపాజీ 34వ పుట్టినరోజు..కేక్ తిని చిందులు వేసిన ‘సుజీ’

10TV Telugu News

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో చింపాంజీకి 34వ పుట్టిన రోజు వేడుకలను జూ అధికారులు జరిపారు. జూ సిబ్బంది సమక్ష్యంలో ‘సుజీ’ అనే చింపాంజీ 34వ పుట్టిన రోజు సందర్భంగా సుజీ బోనును చక్కగా అలంకరించి కేక్ కట్ చేసి సుజీ కి శుభాకాంక్షలు తెలిపారు.

చింపాంజీ ఉండే గదిలో పండ్లు, కూరగాయలతో అలంకరించారు. రంగు రంగుల పూలు ఉన్న తివాచీ పరిచి ఫ్రూట్ కేక్ కూడా పెట్టి శుభాకాంక్షలు చెప్పారు. ఆ హడావిడి ఏంటో తనకు తెలుసన్నట్లుగా సుజీ కూడా చాలా సేపు వాటిని చూస్తూ తెగ సంబరపడిపోయింది. తరువాత కేకును తినాలని సిబ్బంది దానికి అర్థమయ్యేలా చెప్పారు. దాన్ని అర్థం చేసుకున్న సుజీ కేకు తిన్నదని అధికారులు తెలిపారు.

ప్రతి ఏటా సుజీ పుట్టిన రోజును గ్రాండ్‌గా సందర్శకుల కోలాహలం మధ్యనిర్వహించే వారు జూ సిబ్బంది. కానీ కరోనా వైరస్ కారణంగా నిబంధనలు పాటిస్తూ సాదాసీదాగా జరిపారు. ఈ సంవత్సరం కరోనా వల్ల పెద్దగా సందర్శకులు లేకుండానే అతి కొద్ది మంది సిబ్బంది మినహా సుజీ పుట్టిన రోజు వేడుకకు ఎవరూ లేరు. కేక్ కటింగ్ తర్వాత రొట్టెలను సుజీకి ఆహారంగా అందించారు. కాగా సుజీని 2011 లో సహారా గ్రూప్ జూపార్కుకు బహుమతిగా ఇచ్చింది. అప్పటి నుంచి అది జూపార్క్ లో సందర్శకులను అలరిస్తోంది. సుజీని చూసి సందర్శకులు తెగ సంబరపడిపోతారని జూ సిబ్బంది వెల్లడించారు.