మాడుగుల పాలిట్రిక్స్ : ఒకే కుటుంబం మూడు పార్టీల్లో ముగ్గురు

  • Published By: veegamteam ,Published On : March 25, 2019 / 06:38 AM IST
మాడుగుల పాలిట్రిక్స్ : ఒకే కుటుంబం మూడు పార్టీల్లో ముగ్గురు

మాడుగుల  : ఏపీలో ప్రచారాల జోరు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పలు కుటుంబాలకు చెందిన వారు వేర్వేరు పార్టీలలో కొనసాగుతుంటారు. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు వ్యక్తులు మూడు పార్టీల తరపున పోటీకి సిద్ధపడుతున్నారు.  భార్యభర్తలు, అన్నదమ్ములు, తండ్రీ కూతుళ్లు వేర్వేరు పార్టీలో చేరి ప్రత్యర్థులతో పోటీకి సై అంటున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని గవిరెడ్డి కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మూడు పార్టీలో చేరి అసలు సిసలైన రాజకీయ నాయకులమంటున్నారు.
 

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజపురం గ్రామంలో ఉండే గవిరెడ్డి దేముడుబాబు, సన్యాసమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. వీరిలో ముగ్గురు రాజకీయాల్లో ఉన్నారు. వీరిలో సినీ నటి సుజాత అలియాస్ రమ్యశ్రీ వైసీపీలో పని చేస్తుండగా రమ్యశ్రీ అన్న సన్యాసినాయుడు జనసేన తరపున పోటీచేస్తుండగా..తమ్ముడు గవిరెడ్డి రామానాయుడు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. 
 

సుజాత సినిమా రంగంలో రమ్యశ్రీగా గుర్తింపు పొందటమే కాక తన పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి..సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఇటీవల జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరి ప్రస్తుతం జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. 

గవిరెడ్డి సన్యాసినాయుడు గతంలో మాడుగుల నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ప్రారంభం తరువాత ఆ పార్టీలో చేరినా టికెట్‌ రాకపోవటంతో జనసేనలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ తరపున మాడుగుల బరిలో ఉన్నారు.  విశాఖలో బంగారు నగల విక్రయ దుకాణం నిర్వహించే గవిరెడ్డి రామానాయుడు రాజకీయాల్లో ప్రవేశించాక 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి మాడుగుల ఎమ్మెల్యేగా గెలుపు సాధించారు. 2014లో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మాడుగులలో అన్నదమ్ములు ప్రత్యర్థులుగా బరిలో దిగుతుండటంతో ఆసక్తి నెలకొంది.