కరోనా వల్ల ఉపాధి కోల్పోయి…రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకుంటున్న ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్
Cruise chef sells biryani at roadside stall కరోనా మనుషులనే కాదు వారి జీవనోపాధిని కూడా కాటేసింది. మహమ్మారి దెబ్బకి వేలమంది బతుకులు రోడ్డు పాలయ్యాయి. ఆ బాధితుల్లో ఒకరే అక్షయ్ పార్కర్.
మహారాష్ట్రకి చెందిన అక్షయ్ పార్కర్ చేయి తిరిగిన వంటగాడు. కరోనాకి ముందు ఇంటర్నేషనల్ స్టార్ హోటల్లో ఆయన కింద ఎందరో వంటగాళ్లు ఉండేవారు. తాజ్ ఫ్లైట్ సర్వీస్‌తో పాటు ప్రిన్సెస్ క్రూయిజ్‌లోనూ పని చేసేవాడు. కానీ కరోనా వల్ల ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగం ఊడిపోయింది.
చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇలాగైతే బతుకు బండి ముందుకు సాగదని తెలసుకున్న అక్షయ్ ముంబైలోని దాదర్‌లో జేకే సావంత్ మార్గ్ ప్రాంతంలో చిన్న స్టాల్ పెట్టుకుని బిర్యానీ వండుతూ నాలుగు పైసలు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టార్ హోటల్ నుంచి దిగి వచ్చి వీధిలో బండి పెట్టుకోవడం మామూలు విషయం కాదని నెటిజన్లు అతడిని కీర్తిస్తున్నారు. ఇక ఎంతైనా స్టార్ హోటల్ చెఫ్ కాబట్టి బిర్యానీ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంది. కిలో వెజ్ బిర్యానీ రూ.800, కిలో నాన్ వెజ్ బిర్యానీ రూ.900కు అమ్ముతున్నాడు.