టీడీపీని దెబ్బకొట్టేందుకు : వైసీపీ, బీజేపీ, ఈసీ కుట్ర

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 12:05 PM IST
టీడీపీని దెబ్బకొట్టేందుకు : వైసీపీ, బీజేపీ, ఈసీ కుట్ర

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ తెలంగాణకు ఒకలా, ఏపీకి ఒకలా ఉంటుందా అని సోమిరెడ్డి ఈసీని  ప్రశ్నించారు. తెలంగాణలో మంత్రులు సమీక్షలు జరుపుతున్నారని, వారికి కోడ్ వర్తించదా అని అడిగారు. వైసీపీ, బీజేపీ, ఈసీ కుట్రంపూరితంగా వ్యవహరిస్తున్నాయని.. టీడీపీకి, ప్రభుత్వానికి చెడ్డ  పేరు తేవాలని ఇలా చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి అన్నారు.

ఓ వైపు కరవు, మరోవైపు తుపాను ముప్పు పొంచి ఉంటే అధికారులతో సమీక్షకు ఈసీ అనుమతి ఇవ్వడం లేదని సోమిరెడ్డి  మండిపడ్డారు. ఏపీ పట్ల ఈసీకి ఎందుకింత వివక్ష అని అడిగారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల తీరుపై సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను సమీక్ష అనలేదు అని, డిస్కషన్ మాత్రమే అన్నానని.. అయినా అధికారులు రాకపోవడం బాధాకరం అన్నారు.
Also Read : ఆ జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ సవరించండి… సీఈసీకి ఏపీ సీఎం లేఖ

కరవు, ప్రకృతి వైపరిత్యాల సమయంలో సమీక్షలు చేయవచ్చు అని సోమిరెడ్డి అన్నారు. ఇలాంటి సమయాల్లో సమీక్షలకు ఈసీ పర్మిషన్ ఇవ్వాలన్నారు. ఈసీ తీరుతో అధికారులు  అయోమయంలో పడిపోయారని, ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదని సోమిరెడ్డి అన్నారు. ప్రభుత్వం, ఈసీ ఆదేశాల్లో ఎవరిమాట వినాలో అధికారులకే తెలియడం లేదన్నారు.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారులు మరోసారి ఝలక్ ఇచ్చారు. రెండో రోజూ సమీక్షకు అధికారులు ఎవరూ హాజరవలేదు. బుధవారం (మే 1,2019) ఉదయం 11.30 గంటలకు  ఉద్యాన శాఖపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని అనుకున్నారు. అధికారులు మాత్రం అటెండ్ అవ్వలేదు. చివరికి మంత్రి సమీక్షను రద్దు చేసుకున్నారు. ఈసీ నిబంధనలతో అధికారులు  సమీక్షలకు దూరంగా ఉంటున్నారు. సమీక్షలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని ఈసీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

అధికారులు రివ్యూస్ కి హాజరుకాకూడదని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం  ఆదేశించారు. తొలి రోజు (ఏప్రిల్ 30,2019) వ్యవసాయ శాఖ, రెండో రోజు (మే 1,2019) ఉద్యాన శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించాలని సంబంధిత అధికార యంత్రాంగానికి మంత్రి సోమిరెడ్డి  నోటీసులు పంపారు. మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు కానీ, బుధవారం ఉద్యాన శాఖ అధికారులు కానీ.. సమీక్షకు హాజరుకాలేదు. తాను సమీక్ష చేయలేకపోతే పదవి నుంచి  తప్పుకుంటానని సోమిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : టీడీపీ, వైసీపీ నుంచి పోలీసులు డబ్బులు వసూలు : పెనమలూరు మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు