Ap Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తారని ప్రజలను భయపెడుతున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు.

Ap Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Botcha Satyanarayana (Photo Credit : Botcha Satyanarayana Facebook)

Updated On : May 3, 2024 / 9:31 PM IST

Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. దీనిపై అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో జరుగుతోంది. ఈ కొత్త భూ చట్టంతో భూ యజమానులకు మేలు జరుగుతుందని అధికార పక్షం అంటుంటే.. ఈ చట్టంతో భూములు లాక్కునే కుట్ర జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఈ వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

భూమిపై యజమానులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించడం కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోర్టులో ఉందని, కోర్టు తీర్పు తర్వాతే అమలుపై ఆలోచిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తారని ప్రజలను భయపెడుతున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. నేరపూరితమైన ఆలోచనతో ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత ఇలాంటి దుష్ప్రచారాలు చేసే వారి పై కేసులు పెడతామని హెచ్చరించారు మంత్రి బొత్స.

”బాలకృష్ణ ఎవరో రాసిన స్క్రిప్ట్ కష్టపడి చదువుతున్నారు. మీరు మాట్లాడింది కరెక్ట్ గా ఉందా బాలకృష్ణ? మీరు చేసిన ఆరోపణలపై డిబేట్ కు నేను సిద్ధం? మీరు సిద్ధమా? ఎల్ కేజీ నుండి రాష్ట్రంలో ఉన్న విద్యావ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. టోఫెల్, ఇంగ్లీష్ మీడియం వంటి విధానాలతో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టాo. ప్రతి పేదవాడికి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింది. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు ఉన్నప్పుడు కానీ ఇంతటి విద్యా సంస్కరణలు వచ్చాయా?

ఏపీ విద్యా విధానాన్ని ప్రధానమంత్రి అకడమిక్ అడ్వజర్ కమిటీనే ప్రశంసించింది.
టీడీపీకి చెందిన దుర్మార్గులు పెట్టిన పిటిషన్ వల్ల వృద్దులు, వికలాంగులకు ఫించన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. వృద్ధుల ఉసురు పోసుకుంటున్నారు. గత నెలలో 33 మంది చనిపోయారు. దుర్మార్గుల దుర్బుద్ధి వల్ల ఫించన్ దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫించన్ దారుల ఉసురు కచ్చితంగా తగులుతుంది” అని మంత్రి బొత్స అన్నారు.

Also Read : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. భూ యజమానులకు జరిగే మేలేంటి..? ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత..?